కేంద్ర ప్రభుత్వం 2016లో రద్దు చేసిన రూ. 500, రూ.1000 నోట్లను ఢిల్లీ పోలీసులు పెద్ద మొత్తంలో పట్టుకున్నారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసారు.
వివరాల ప్రకారం ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ఒక పెద్ద సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించింది. షాలిమార్ బాగ్ మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 4 దగ్గర జరిగిన ఈ దాడుల్లో రూ. 3.5 కోట్ల విలువైన రద్దయిన నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ 2016 నవంబర్ నోట్ల రద్దు (Demonetisation) తర్వాత చెల్లని నోట్లే. దింతో పోలీసులు హర్ష్, టేక్ చంద్, లక్ష్య, విపిన్ కుమార్ అనే నలుగురు అనుమానితులను పట్టుకున్నారు.
పోలీస్ బృందం దాడి చేసి, రద్దు చేసిన కరెన్సీ నోట్ల కట్టలతో ఉన్న చాలా బ్యాగులను స్వాధీనం చేసుకుంది. అయితే నిందితులు తక్కువ ధరకు ఈ నోట్లను కొని.... ఎక్కువ ధరకు తిరిగి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమ వ్యాపారానికి ఉపయోగించిన రెండు వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను విచారించిన పోలీసులు.... నిందితులు ఈ పాత నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో మార్చుకోవచ్చని నమ్మించి.. రద్దయిన రూ. 500, రూ. 1000 నోట్లను తక్కువ ధరకు కొని వాటిని తిరిగి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నోట్లు నిందితుల దగ్గర ఉంచుకోవడానికి ఎలాంటి సరైన ఆధారాలు లేవు అని చెప్పారు.
నోట్ల రద్దు తర్వాత రద్దు చేసిన నోట్లను కొనడం, ఉంచుకోవడం లేదా అమ్మడం అనేది 2017లో వచ్చిన స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ చట్టం ప్రకారం నేరం. దీంతో పోలీసులు నిందితులపై మోసం, కుట్ర, నోట్ల రద్దు చట్టాన్ని ఉల్లంఘించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ భారీ మొత్తంలో నోట్ల డబ్బు వారికి ఎలా వచ్చాయి, ఇందులో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన రద్దయిన నోట్ల అక్రమ వ్యాపారం ఇంకా కొనసాగుతుందనే ఆందోళనలను పెంచుతోంది.

