పదేండ్లు మొద్దు నిద్రపోయి.. ఇప్పుడు ఆరోపణలా? : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

పదేండ్లు మొద్దు నిద్రపోయి.. ఇప్పుడు ఆరోపణలా? : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • ప్రజలు ఓడించినా బీఆర్ఎస్ నేతల భాష, తీరు మారలేదు: భట్టి

నల్గొండ/హాలియా, వెలుగు: పదేండ్లు బీఆర్ఎస్​ మొద్దునిద్ర పోతే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి వాటాలు తేల్చేందుకు ప్రయత్నిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వారి హయాంలో ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. వాళ్ల పాలనలో చేసిన తప్పులను  సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​సరిదిద్దుతుంటే ఏపీకి నీళ్లను ధారాదత్తం చేశారంటూ ఆరోపణలు చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. -సీఎం స్థాయి వ్యక్తిని బీఆర్ఎస్ నేతలు హౌలే, సన్నాసి అనడం ఏం సంస్కృతి అని ధ్వజమెత్తారు. శుక్రవారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లో డిప్యూటీ సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్​ పాలనలో నిర్లక్ష్యం వల్లనే శ్రీశైలం ఎగువ భాగాన ఎత్తిపోతల పథకాన్ని ఏపీ ప్రభుత్వం  కట్టుకుందన్నారు.  

రూ.500 కోట్ల ఖర్చుతో  మొదలుపెట్టిన సీతారామ ప్రాజెక్టు ఎందుకు పనికి రాకుండా పోయిందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత  రూ.100 కోట్లతో  రాజీవ్ లింకు కెనాల్ ద్వారా గోదావరి నీటిని కృష్ట్రా కాలువలకు అనుసంధానం చేశామన్నారు. అలాగే,  కేంద్ర విద్యుత్ సంస్థల అంచనా మేరకు 2030 నాటికి 25 వేల మెగావాట్ల విద్యుత్ అవసరమని, డిమాండ్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో గ్రీన్ పవర్ వైపు వెళ్తున్నామని భట్టి తెలిపారు.

పవర్ ప్రాజెక్టుల్లో నిర్లక్ష్యం వద్దు

అనుకున్న సమయానికి అన్ని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ లను వినియోగంలో తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి  అధికారులకు సూచించారు. పవర్ ప్రాజెక్టుల విషయంలో  నిర్లక్ష్యంగా ఉండవద్దన్నారు. ప్రాజెక్టుల పురోగతిపై ప్రతి వారం సమీక్షించాలన్నారు.  నాగార్జునసాగర్ జెన్కో పవర్ హౌస్ లో హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై శుక్రవారం డిప్యూటీ సీ‌‌‌‌‌‌‌‌ఎంసమీక్ష నిర్వహించారు. డిమాండ్ మేరకు పవర్​సప్లై చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జెన్​కో సిబ్బంది సీఎండీ మొదలుకొని కిందిస్థాయి వరకు కొత్త టెక్నాలజీ పై 3 రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుద్ధవనంను సందర్శించి బుద్ధుని పాదుకల వద్ద పుష్పాంజలి ఘటించారు.