- విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని 8 వేల మెగావాట్లకు పెంచుతాం: భట్టి విక్రమార్క
- రాష్ట్రాన్ని క్లీన్ఎనర్జీ మాన్యూఫాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
- ‘ఇండియా ఎనర్జీ సమిట్’ ఎక్స్పో 2026లో డిప్యూటీ సీఎం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణను క్లీన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 2035 కల్లా తెలంగాణలో 26 వేల మెగావాట్ల సోలార్ పవర్ ఏర్పాటు చేస్తామని, విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని 8 వేల మెగావాట్లకు పెంచుతామని ప్రకటించారు. హైదరాబాద్‌లోని హైటెక్స్, నోవాటెల్‌లో రెండు రోజులపాటు జరగనున్న 'ఇండియా ఎనర్జీ సమిట్ అండ్ ఎక్స్ పో 2026' ను మంగళవారం డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఈ సమిట్‌కు హాజరైన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు, సాంకేతిక నిపుణులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం ప్రసంగించారు. ఇంధన రంగంలో మార్పు అంటే కేవలం విద్యుత్ ఉత్పత్తి మూలాలను మార్చడం మాత్రమే కాదని, అది సమగ్ర ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని మార్చే విప్లవాత్మక ప్రక్రియ అని పేర్కొన్నారు. క్లీన్ ఎనర్జీ రంగానికి అవసరమైన సాంకేతికతను అందించే ప్రధాన కేంద్రంగా రాష్ట్రాన్ని నిలపాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకుంటూనే, పర్యావరణ పరిరక్షణను సాధించేలా ప్రణాళికలు రూపొందించామని డిప్యూటీ సీఎం చెప్పారు. ఇందులో భాగంగా 2030 నాటికి 20 వేల మెగావాట్లు, 2035 నాటికి 26 వేల మెగావాట్లకు పైగా సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని పెంచనున్నట్లు తెలిపారు. పునరుత్పాదక ఇంధనానికి అత్యంత కీలకమైన 'విద్యుత్ నిల్వ' సామర్థ్యాన్ని కూడా భారీగా విస్తరిస్తున్నామని చెప్పారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా 2030 నాటికి 3,800 మెగావాట్లు, 2035 నాటికి 8 వేల మెగావాట్ల నిల్వ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామన్నారు.
ఫ్యూచర్ సిటీలో ఏఐ డేటా సెంటర్
హైదరాబాద్‌లోని ఐటీ, ఏఐ నైపుణ్యాలను ఉపయోగించి భవిష్యత్తు విద్యుత్ గ్రిడ్‌ను డిజిటల్ నెట్‌వర్క్‌గా మారుస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 'భారత్ ఫ్యూచర్ సిటీ'లో ఏర్పాటు చేయబోయే ఏఐ డేటా సెంటర్ కోసం ప్రత్యేకంగా 100 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్లాంట్‌ను అనుసంధానిస్తున్నట్లు భట్టి వెల్లడించారు. వీటితో పాటు 2030 నాటికి ఏటా 4 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, 2035 నాటికి 12 వేల ఈ వీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
సోలార్, విండ్, బ్యాటరీ ఉత్పత్తులను ఇక్కడే తయారు చేసే కంపెనీలకు మూలధన సాయం, ఎస్ జీ ఎస్ టీ రీయింబర్స్‌మెంట్, విద్యుత్ సుంకం మినహాయింపులతో పాటు టీజీ ఐపాస్ ద్వారా వేగవంతమైన అనుమతులు ఇస్తున్నామని వివరించారు. ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతోనే ఈ ఇంధన విప్లవం సాధ్యమవుతుందని, తెలంగాణతో కలిసి నడవాలని పారిశ్రామికవేత్తలకు డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం ఏర్పాటుచేసిన వివిధ స్టాల్స్ ను ఆయన సందర్శించారు. డిప్యూటీ సీఎం వెంట స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తదితరులు ఉన్నారు.
