డిస్నీలో మరోసారి ఉద్యోగాల కోత : 1,000 మందిని తొలగించేందుకు కంపెనీ రెడీ !

 డిస్నీలో మరోసారి ఉద్యోగాల కోత : 1,000 మందిని తొలగించేందుకు కంపెనీ రెడీ !

ప్రముఖ వినోద సంస్థ డిస్నీ రాబోయే కొద్ది వారాల్లో సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ జోష్ డి'అమారో బాధ్యతలు చేపట్టాక తీసుకుంటున్న మొదటి పెద్ద నిర్ణయం ఇదే. ఈ కోతల ప్రభావం ముఖ్యంగా కంపెనీలోని మార్కెటింగ్ విభాగంపై ఎక్కువగా ఉండనుంది.

డిస్నీ సంస్థ గత కొన్నేళ్లుగా  ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని కీలక మార్పులు చేసింది.  2022లో బాబ్ ఇగర్ మళ్లీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు 8,000 మందిని డిస్నీ తొలగించింది.

 టీవీ ఛానళ్ల ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం, స్ట్రీమింగ్ (OTT) రంగంలో లాభాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే బాక్సాఫీస్ వద్ద సినిమాలు సరిగ్గా ఆడకపోవడం, అమెజాన్, యూట్యూబ్ వంటి సంస్థల నుండి వస్తున్న పోటీని తట్టుకోవడానికి డిజిటల్ రంగంపై డిస్నీ ఎక్కువ దృష్టి పెడుతోంది.

డిస్నీలో మొత్తం 2,31,000 మంది ఉద్యోగులు ఉండగా, వారిలో 80 శాతం మంది థీమ్ పార్కులు, క్రూయిజ్ షిప్పులలో పనిచేస్తున్నారు. 
ఈ ఉద్యోగ కోతలు ఎంటర్‌టైన్‌మెంట్, క్రీడా విభాగంలో ESPN, కార్పొరేట్ ఆఫీస్లో  పని చేసేపరిపై ప్రభావం చూపుతుంది. 

ALSO READ : ఇజ్రాయెల్ - లెబనాన్ దాడుల ఎఫెక్ట్

డిస్నీ  ఖర్చులను తగ్గించుకోవడానికి వేర్వేరు విభాగాలను ఒకటిగా కలిపేస్తోంది. గతంలో వినోదం, క్రీడలు, ఇతర విభాగాలకు వేర్వేరు మార్కెటింగ్ టీమ్స్ ఉండేవి. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి ఒకే అధికారి కిందకు తెచ్చారు. అలాగే డిస్నీ+, హులు (Hulu) యాప్‌లను కూడా కలిపే పనిలో ఉన్నారు.

కేవలం డిస్నీ మాత్రమే కాదు, వినోద రంగంలోని ఇతర పెద్ద కంపెనీలైన సోనీ పిక్చర్స్, పారామౌంట్, వార్నర్ బ్రదర్స్ కూడా ఇప్పటికే చాలా మంది ఉద్యోగులను తొలగించాయి. భవిష్యత్తులో ఈ కంపెనీలు విలీనమైతే మరిన్ని ఉద్యోగ కోతలు ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.