తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే కేసులో డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా ఆర్. రాధాకృష్ణన్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆయన ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
సమాచారం ప్రకారం... గత నెల జూన్ 20న తూత్తుకుడి జిల్లాలోని ఆత్తూరులో జరిగిన ఒక బహిరంగ సభలో అనితా రాధాకృష్ణన్ ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఆయన ముఖ్యమంత్రి విజయ్‌ను ఉద్దేశించి పరువు నష్టం కలిగించేలా మాట్లాడారంటూ అధికార తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీకి చెందిన స్థానిక నాయకుడు సెల్వం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా తిరుచెందూర్ ఎమ్మెల్యే అయిన రాధాకృష్ణన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
తాను అరెస్ట్ అవుతానని ఊహించిన రాధాకృష్ణన్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కానీ శుక్రవారం జస్టిస్ జీకే ఇళంతిరైయన్ ఆ పిటిషన్‌ను కొట్టివేయడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడానికి రెడీ అయ్యారు. కోర్టు ఆర్డర్ వచ్చిన వెంటనే, రాధాకృష్ణన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
డీఎంకే కార్యకర్తల నిరసన
ఈ అరెస్ట్ విషయం తెలియగానే డీఎంకే మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు నిరసనలకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కొంతసేపు రోడ్డును దిగ్బంధించడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తర్వాత పోలీసులు ఎమ్మెల్యేను తదుపరి విచారణ కోసం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) కార్యాలయానికి తరలించారు.
►ALSO READ | దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. మీరు జోక్యం చేసుకోవాలి.. సుప్రీంకోర్టుకు ప్రతిపక్ష నాయకుల లేఖ
కాగా, ముందస్తు బెయిల్ పిటిషన్‌లో రాధాకృష్ణన్ వాదిస్తూ.. తాను ఒక రాజకీయ సమావేశంలో భాగంగానే మాట్లాడానని, ప్రజల సమస్యలపై చర్చిస్తూ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను మాత్రమే విమర్శించానని పేర్కొన్నారు.
ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ ఆగ్రహం
ఈ అరెస్టును ప్రతిపక్ష డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తీవ్రంగా తప్పుపట్టారు. సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి రాజకీయ వ్యూహాలు పన్నుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో హత్యలు, దొంగతనాలు, మహిళలపై జరుగుతున్న ఘోరమైన నేరాలను అరికట్టడంలో విఫలమైన ప్రభుత్వం.. ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడంలో మాత్రం ఎందుకు అంత తొందరపాటు చూపిస్తోందని ప్రశ్నించారు.
రాజకీయాల్లో విమర్శలు చేయడం సహజమని, కేవలం విమర్శలు చేసినందుకే అరెస్టులు చేసుకుంటూ పోతే ఎంతోమంది మంత్రులు కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని స్టాలిన్ అన్నారు. ఈ అరెస్టుతో అధికార టీవీకే (TVK) పార్టీకి, ప్రతిపక్ష డీఎంకే (DMK)కి మధ్య తమిళనాడులో రాజకీయ ఘర్షణ మరింత ముదిరింది.
