నా సహనాన్ని తేలిగ్గా తీసుకోవద్దు.. తెగించే రాజకీయాల్లోకి వచ్చా 

నా సహనాన్ని తేలిగ్గా తీసుకోవద్దు.. తెగించే రాజకీయాల్లోకి వచ్చా 
  • నేను అడుగుపెట్టలేనని బెట్టింగులు కడతారా..?
  • యాక్షన్.. కట్ అంటే వెళ్లిపోయేటోడ్ని కాదు 
  • నా సహనాన్ని తేలిగ్గా తీసుకోవద్దు 
  • 20ఏళ్లు నాతో ప్రయాణం చేయగలిగితేనే జనసేనలోకి రండి
  • రాజమండ్రిలో పవన్ కళ్యాణ్

రాజమండ్రి: యాక్షన్.. కట్ అంటె వెళ్లిపోయేటోడ్ని కాదని.. అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నేను ఏపీలో అడుగుపెట్టలేనని బెట్టింగులు కడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. 20 ఏళ్లు తనతో ప్రయాణం చేయగలిగితేనే జనసేనలోకి రావాలని సూచించారు. జనసేప పార్టీ తరపున చేసిన ప్రకటన మేరకు గాంధీ జయంతి సందర్భంగా శనివారం తూర్పు గోదావరి జిల్లాలో బాలాజీపేట రోడ్డుకు శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ శ్రమదానం సరదా కొద్దీ చేయలేదనే విషయం గుర్తుంచకోవాలన్నారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు.. ఇప్పుడు మెతక లీడర్లు ఉన్న రోజులు కావు.. రాజకీయ పార్టీ నడపడం అంత సులువు కాదు.. అన్నీ తెగించే వచ్చానని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర రాజకీయాలు కేవలం రెండిళ్ల మధ్య జరిగితే కుదరదని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.

సీఎం అయ్యాకే అలా పిలవండి.. ఇప్పుడు జనసేనాని అని పిలవండి
తన ప్రసంగం కొనసాగిస్తున్న సమయంలో అభిమానులు పదేపదే సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఇప్పుడు అలా పిలవొద్దు.. జనసేన అధినేతగా వచ్చాను.. సీఎం అయ్యాకే సీఎం అని పిలవండి.. పవర్ లోకి వచ్చాక పవర్ స్టార్ అని పిలవాలి.. ఇప్పుడు మాత్రం జనసేనాని అని పిలవాలని పవన్ కళ్యాణ్ అభిమానులకు పిలుపునిచ్చారు. నా కోసమే ఆలోచిస్తే తిట్టే వారిని కింద కూర్చోబెట్టి నార తీసేవాడినని.. గాంధీ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నానని.. తిడితే.. భయపెడితే భయపెట్టే వాడిని కానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ నాశనం చేస్తోందనిని.. కేవలం తన వర్గం వారి సంక్షేమం కోసం పనిచేస్తూ.. ప్రశ్నించే వారిని టార్గెట్ చేయడం చేస్తోందని ఆయన అన్నారు.  జనానికి రోడ్లు లేవు, ఉద్యోగులకు జీతాలు, కనీసం పెన్షన్లు కూడా రాని పరిస్థితి ఉందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.  బైబిల్ చేత్తో పట్టుకుని తిరిగేవాడిని కాదని, గుండెల్లో పెట్టుకునే వ్యక్తినని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.  ఒంటరి, తెలగ, బలిజ, కాపు కులాలు ముందుకొచ్చి పెద్దన్న పాత్ర పోషస్తే తప్ప మిగిలిన కులాలకు సాధికారిత వచ్చే పరిస్థితి లేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.