నెత్తురోడుతున్నా సాయం చేయలె!.. ప్రాణం పోతున్నా పట్టించుకోలె..

నెత్తురోడుతున్నా సాయం చేయలె!.. ప్రాణం పోతున్నా పట్టించుకోలె..
  • ఫొటోలు తీస్తూ నిల్చున్న జనం
  • ఢిల్లీలో యాక్సిడెంట్.. గాయాలతో యువకుడు మృతి
  • నిందితుడి మొబైల్​ ఫోన్, విలువైన కెమెరా చోరీ

ఢిల్లీలో యాక్సిడెంట్​కు గురై నెత్తురోడుతూ పడి ఉన్న ఓ యువకుడిని కాపాడాల్సిన జనం.. ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు. టైమ్​కు  ట్రీట్​మెంట్​ అందక ఆ యువకుడు చనిపోయాడు.

న్యూఢిల్లీ: యాక్సిడెంట్​కు గురై నెత్తుటి మడుగులో పడి ఉన్న వ్యక్తిని కాపాడాల్సిన జనం.. ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాధితుడి ఫోన్ తో పాటు విలువైన కెమెరాను దొంగలు ఎత్తుకెళ్లారు. ఆసుపత్రికి తరలించడం ఆలస్యం కావడంతో సమయానికి చికిత్స అందక ఆ యువకుడు కన్నుమూశాడు. ఈ అమానవీయ ఘటన దక్షిణ ఢిల్లీలోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జరిగింది. ఢిల్లీకి చెందిన పియూష్​పాల్(30) అనే వ్యక్తి డాక్యుమెంటరీ ఫిల్మ్​మేకర్. అక్టోబర్ 28న రాత్రి 10 గంటల ప్రాంతంలో దక్షిణ ఢిల్లీలోని పంచశీల్​ఎన్​క్లేవ్​సమీపంలో బైక్​పై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన మరో బైక్​బలంగా ఢీకొంది.

దీంతో పాల్​ బైక్​ స్కిడ్ అయి​ రోడ్డుపై కొద్దిదూరం పాటు అతడిని ఈడ్చుకెళ్లింది. పాల్​కు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న పాల్​ను వెంటనే హాస్పిటల్​కు తీసుకువెళ్లాల్సిన జనం అతని చుట్టూ గుమిగూడి ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీశారు. దాదాపు 20 నిమిషాల తర్వాత కొందరు హాస్పిటల్​కు తీసుకువెళ్లగా.. చికిత్స పొందుతూ పాల్ చనిపోయాడు. ఈ యాక్సిడెంట్​ఘటన సిగ్నల్ సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఘటనపై పాల్ ​ఫ్రెండ్​ స్పందిస్తూ.. ‘‘పాల్ ను వెంటనే హాస్పిటల్​కు తీసుకువెళ్తే బతికే వాడు.. రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సింది పోయి అక్కడున్న జనం ఫొటోలు తీస్తూ ఉండిపోయారు. ఘటన స్థలంలో పడిపోయిన పాల్​ మొబైల్ ​ఫోన్, గో ప్రో కెమెరాను ఎవరో ఎత్తుకెళ్లారు” అని ఆవేదన వ్యక్తం చేశాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా యాక్సిడెంట్​కు కారణమైన బంటి అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.a