- పరారీలో ఉన్న నిందితుల కోసం ఈగల్ టీమ్ గాలింపు
హైదరాబాద్, వెలుగు: గంజాయి, డ్రగ్స్ సప్లయర్లను పట్టుకునేందుకు ఈగల్ టీమ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తప్పించుకు తిరుగుతున్న సప్లయర్లతో పాటు నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుంది. గత 20 రోజుల్లో 225 మందిని అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో చాంద్రయణగుట్టకు చెందిన పాత నేరస్తుడు, గంజాయి సప్లయర్ ఖాజా వాహిబుద్దీన్‌ను గురువారం రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద అదుపులోకి తీసుకుంది.
అతని నుంచి రూ.14 లక్షలు విలువ చేసే 28 కిలోల గంజాయి, బలెనో కారు, ఇంటర్నెట్ డంగెల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఖాజా వాహిబుద్దీన్‌పై 2005 నుంచి 43 క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఈగల్ అధికారులు గుర్తించారు. ఒడిశాకు చెందిన గురు అనే వ్యక్తి నుంచి ఖాజా వాహిబుద్దీన్ గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. ఒక్కో ప్యాకెట్‌ను రూ.10 వేల చొప్పున కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో రూ.50 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు ఈగల్ టీమ్ దర్యాప్తులో వెలుగు చూసింది. కేవలం వాట్సాప్ కాల్ ద్వారా మాత్రమే కస్టమర్లతో కాంటాక్ట్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు.
