మనిషి వెంట్రుకల ఎగుమతి పేరుతో అక్రమ దందా.. అస్సాం, నాగాలాండ్, తమిళనాడులలో ఈడీ సోదాలు...

మనిషి వెంట్రుకల ఎగుమతి పేరుతో అక్రమ దందా.. అస్సాం, నాగాలాండ్, తమిళనాడులలో ఈడీ సోదాలు...

మనిషి వెంట్రుకల ఎగుమతి ముసుగులో అక్రమ విదేశీ లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఇవాళ  (నవంబర్ 4న) అస్సాం, నాగాలాండ్, తమిళనాడు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. ఈ ఆపరేషన్‌ను ఫెమా (విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం) కింద దిమాపూర్ కార్యాలయం చేపట్టింది. దిమాపూర్, గౌహతి ప్రదేశాలతో పాటు  చెన్నైలోని మూడు ప్రదేశాలలో ఈ దాడులు జరిగాయి.

ఈ దాడులు ముఖ్యంగా లిమా ఇమ్సాంగ్ అండ్ అతని ఏకైక సంస్థ అయిన ఇమ్సాంగ్ గ్లోబల్ సప్లయర్స్ కో పై జరిగింది. ED ప్రకారం, ఈ కంపెనీ మనిషి వెంట్రుకల ఎగుమతుల చెల్లింపుల పేరుతో విదేశాల నుండి డబ్బు అందుకుంది. అయితే, దిమాపూర్‌లో ఈ వ్యాపారం అసాధారణం అని ఏజెన్సీ అభిప్రాయపడింది.
 
మనిషి వెంట్రుకల ఎగుమతికి సంబంధించిన షిప్పింగ్ బిల్లులు, ఇన్‌వాయిస్‌లు వంటి పేపర్స్ ఇచ్చిన  గడువులోగా బ్యాంకుకు అందించడంలో సంస్థ విఫలమైంది. RBI నిబంధనల ప్రకారం, పేపర్స్ సమర్పించకపోవడం, ఎగుమతి ఆదాయాన్ని సరిగా చూపించకపోవడం FEMA ఉల్లంఘన కిందకు వస్తుంది.

ఇమ్సాంగ్ గ్లోబల్ అకౌంట్లో  వచ్చిన డబ్బును ఇంకెమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు, అలాగే ఇమ్సాంగ్ & అతని కుటుంబ సభ్యుల పర్సనల్ అకౌంట్లకు బదిలీ చేశారు.

ఇంకెమ్ ఇండియా కంపెనీ, డబ్బు రాకముందు నిశ్శబ్దంగా ఉండి, దర్యాప్తు సమయంలో నష్టాలను చూపడం వల్ల అది కేవలం డబ్బును అటూ ఇటూ తిప్పడానికి ఏర్పాటు చేసిన 'షెల్ కంపెనీ' (నకిలీ సంస్థ) అయి ఉండవచ్చని తెలుస్తోంది.

ఇంకెమ్ ఇండియా ద్వారా మళ్లించిన డబ్బు చెన్నైలోని మనిషి వెంట్రుకల వ్యాపారంలో ఉన్న  అనుమానాస్పద సంస్థలకు తరలించినట్లు తేలింది.