- స్పెషల్ ఈవెంట్ పర్మిషన్ తీసుకుని 22 షాపులు ఓపెన్
- తాడ్వాయిలో లిక్కర్ డిపో ఏర్పాటు చేసి నిత్యం పంపిణీ
- అమ్మకాలపై... సరిహద్దు ప్రాంతాలపైనా ఆఫీసర్ల నిఘా
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : మేడారం మహాజాతరకు మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ స్పెషల్ ఫోకస్ చేసింది. ప్రత్యేకంగా ఈవెంట్ పర్మిషన్ పేరిట ప్రైవేట్ వ్యక్తులకు 22 లిక్కర్షాపులు ఏర్పాటు చేసుకునేందుకు ఐటీడీఏ పర్మిషన్ ఇచ్చింది.
ఒక్కో మద్యం షాపునకు రోజుకు రూ. 9 వేల చొప్పున రాబడి ఆర్జిస్తూ.. మొత్తంగా రూ.17.82 లక్షల ఇన్ కమ్ ఎక్సైజ్ శాఖకు సమకూరింది. ఈనెల 24న మద్య అమ్మకాలను ప్రారంభించగా.. వచ్చే నెల 2న వరకు సేల్స్జరుగుతాయి.
గత జాతరలో ఏడు రోజులు పర్మిషన్ ఇస్తే.. ఈసారి 9 రోజులకు అనుమతి ఇచ్చారు. గత మూడు రోజుల్లోనే రూ. 2 కోట్ల 15 లక్షల మద్యం అమ్మకాలు జరిగాయి. రెండేండ్ల కింద జరిగిన జాతర ద్వారా రూ. 3.35 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి మరింత పెరిగే చాన్స్ ఉంటుందని ఆఫీసర్లు చెప్పారు. జాతరకు భక్తుల తాకిడి పెరుగుతుండగా, మద్యం సేల్స్కూడా పెరిగి రూ. 4.50 కోట్ల మేరకు ఆదాయం రావచ్చని ఎక్సైజ్ఆఫీసర్లు పేర్కొంటున్నారు. మేడారం జాతరను పురస్కరించుకుని పున్నానికి నెలరోజుల ముందు నుంచే భక్తుల రాక మొదలైంది. ఇదే స్థాయిలో మద్యం సేల్స్ పెరిగాయి. ములుగు ఎక్సైజ్ పరిధిలో జనవరిలో 24 రోజులకుగానూ రూ. 22.82 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
ప్రత్యేక నిఘా పెట్టి అమ్మకాలు
జాతర సందర్భంగా మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ ఆఫీసర్లు ప్రత్యేకంగా నిఘా పెంచారు. జాతర పరిసరాల్లోనే మకాం వేశారు. నిత్యం 522 మంది ఎక్సైజ్ ఆఫీసర్లు తనిఖీలు చేపడుతున్నారు. సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, ఏపీ నుంచి మద్యం రాకుండా కట్టడి చేసేందుకు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు.
మేడారంలో మెయిన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయగా, నార్లపూర్ వద్ద సబ్ కంట్రోల్ రూమ్ పెట్టారు. 7 చెక్ పోస్టులు, 15 మొబైల్ పార్టీల ద్వారా ముమ్మరంగా మద్యం అమ్మకాలపై పర్యవేక్షిస్తున్నా రు. షాపులకు మద్యం సప్లయ్ చేసేందుకు తాడ్వాయిలోనే లిక్కర్ డిపోను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కొరత లేకుండా వెంటనే షాపులకు సప్లయ్ చేస్తున్నారు.
