- విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్న ముఠా గుట్టురట్టు.
హైదరాబాద్: విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ద్వారా విదేశీ ఉద్యోగాల ప్రచారం చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఎటువంటి అనుమతులు లేకుండా ఓవర్సీస్ కన్సల్టెన్సీలను నడుపుతూ గ్రీస్, రుమేనియా దేశాల్లో ఉద్యోగాల పేరుతో లక్షలు దండుకుంటున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ట్రివియల్ చాప్టర్ సంస్థకు చెందిన నిరుపమ, అరుణ్ రాజ్ లను జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం (ఏప్రిల్ 14) అరెస్ట్ చేశారు. గ్రీస్, రొమేనియా ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి రూ.50 వేల నుంచి రూ4 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. బాధితులను నమ్మించేందుకు నకిలీ వర్క్ ఆథరైజేషన్ లెటర్ ఇస్తూ మోసం చేస్తున్నారు.
RA లైసెన్స్ లేకుండానే ఓవర్సీస్ కన్సల్టెన్సీ నడుపుతున్న ఈ ముఠా.. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ద్వారా విదేశీ ఉద్యోగాల ప్రచారం చేస్తూ నిరుద్యోగులను ఆకర్షిస్తున్నారు. ఈ కేసులో మరో 8మంది నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇప్పటికే కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ ముఠాపై పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు. విదేశాల్లో ఉద్యోగ ఆఫర్లు నకిలీవో, ఒరిజినల్ వో eMigrate పోర్టల్‌లో ఏజెంట్ల వివరాలు చెక్ చేసుకోవాలని నిరుద్యోగులకు పోలీసులు సూచిస్తున్నారు.

