కాంటా పెట్టడంలేదని ధాన్యానికి నిప్పంటించి నిరసనకు దిగిన రైతులు

కాంటా పెట్టడంలేదని ధాన్యానికి నిప్పంటించి నిరసనకు దిగిన రైతులు
  • ట్రాక్టర్లలోని ధాన్యాన్ని రోడ్డుపై కుప్పగా పోసి రాస్తారోకో
  • మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజ్ పేటలో రైతుల నిరసన

మెదక్ (చేగుంట): కొనుగోలు కేంద్రంలో కాంటా పెట్టకపోవడంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న రైతుల ఆగ్రహం ఆదివారం కట్టలు తెంచుకుంది. ధాన్యానికి నిప్పు పెట్టిన రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన ఆదివారం మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజ్పేటలో జరిగింది. ఇబ్రహీంపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో మక్కారాజ్పేటలో ఇటీవల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. నాలుగు రోజులుగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండగా ఆదివారం కాంటా పెట్టకపోవడంతో రైతులు ఆగ్రహించారు.  ధాన్యాన్ని తూకం వేయాలని డిమాండ్ చేస్తూ ట్రాక్టర్లలోని ధాన్యాన్ని చేగుంట –  గజ్వేల్ రోడ్డుమీద కుప్పగా పోసి రాస్తారోకో చేశారు. మక్కరాజుపేట గ్రామానికి చెందిన బిక్షపతి, రమేష్, రాజయ్య, రాంరెడ్డి,  స్వామి, ఎల్లారెడ్డి తదితర రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ధాన్యం కుప్పకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు.