
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం, ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. ప్రభుత్వం నిధుల విడుదలకు ఒప్పుకోవడంతో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు బంద్ నిర్ణయాన్ని విరమించుకున్నాయి. దీంతో 2025, సెప్టెంబర్ 16 నుంచి ప్రైవేట్ కాలేజీలు యథావిధిగా తెరుచుకోనున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలపై ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు సోమవారం (సెప్టెంబర్ 15) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యి చర్చించారు.
పెండింగ్‌లో ఉన్న రూ.12 వందల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని.. పెద్ద మొత్తంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో కాలేజీల నిర్వహణ కష్టతరంగా మారిందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. కాలేజీ యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు నిధుల విడుదలకు ప్రభుత్వం అంగీకరించింది.
►ALSO READ | రైతులకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణకు అదనంగా 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను రెండు విడతల్లో విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే వారం రోజుల్లో రూ.600 కోట్లు చెల్లిస్తామన్న ప్రభుత్వం.. దీపావళికి మరో రూ.600 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఫీజు రియింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు బంద్ నిర్ణయాన్ని విరమించుకున్నాయి. దీంతో సెప్టెంబర్ 16 నుంచి ప్రైవేట్ కాలేజీలు యథావిధిగా నడవనున్నాయి.