- రోజువారీ కూలీ కూడా దక్కడం లేదని జాలర్ల ఆవేదన
- లభించని ప్రభుత్వ, మత్స్యకార సంస్థ మద్ధతు
ఆసిఫాబాద్, వెలుగు: తెలంగాణ–మహారాష్ట్ర మధ్య ఉన్న ప్రాణహిత–వార్ధా నదుల్లో జాలర్లు ఉదయం వల వేస్తే సాయంత్రానికి రొయ్యలు, చేపలు పుష్కలంగా పడేవి. జాలర్లు గంగమ్మను నమ్ముకొని ధీమాగా ఉంవారు. కానీ ఇప్పుడు వాళ్లను ఖాళీ వలలు వెక్కిరిస్తున్నాయి. ప్రాణహిత–వార్దాలో చేపలు, రొయ్యలు పూర్తిగా తగ్గిపోయాయి. ఫలితంగా జాలర్లు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తరాలుగా నదిని నమ్ముకున్న వాళ్లు ఇప్పుడు ప్రత్యామ్నాయం చూసుకునే దయనీయ పరిస్థితి నెలకొంది.
రోజంతా వెళ్లినా అరకొరగానే..
కాగజ్ నగర్ డివిజన్ లోని సిర్పూర్ టీ, కౌటాల, చింతల మానేపల్లి, బెజ్జూర్, దహెగాం మండలాల్లోని పదుల సంఖ్యలో పరివాహక గ్రామాల కుటుంబాలు ప్రాణహిత, వార్ధా నదుల్లో చేపల వేటే జీవనాధారంగా జీవిస్తున్నాయి. కాలమేదైనా చేపలను వేటాడి వాటిని అమ్ముకొని కుటుంబాన్ని గడుపుకునేవారు. కానీ కొంతకాలంగా ఈ పరిస్థితి మారింది. చేపలతో నిండుగా ఉండే వలలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. రాత్రి పడవలతో నదిలోకి వెళ్లి వేటాడితే రెండు, మూడు కిలోలు మాత్రమే చిక్కుతున్నాయి.
వారికి ప్రభుత్వం, మత్స్య శాఖ నుంచి ఆశించిన మద్దతు అందడం లేదు. మంచి వలలు, బోట్లు, భద్రతా పరికరాలు అందించడంలేదు. చేపల సంపదను పెంచేందుకు అవసరమైన చర్యలూ చేపట్టడంలేదు. నదిలో చేప పిల్లల విడుదల, అక్రమ వేట నియంత్రణ వంటి అంశాలు కాగితాలకే పరిమితమయ్యాయని జాలర్లు వాపోతున్నారు. ప్రకృతి మార్పులు, కాలుష్యం, ఇసుక తవ్వకాలతో నదుల్లో జీవ వైవిధ్యం క్షీణిస్తుండగా.. అధికారుల నిర్లక్ష్యం మరింత దెబ్బతీస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
చేపల వేట భారంగా మారింది
మా తాత, తండ్రి నుంచి మేమంతా నది మీదనే ఆధారపడి బతుకుతున్నం. కానీ కొన్నేండ్లుగా మాకు చేపల వేట భారంగా మారింది. రాత్రి వెళ్లి నదిలో వలలు వేస్తే కనీసం నాలుగైదు కిలోలు పడడం లేదు. ఇదివరకు రోజుకు కనీసం 3, -4 కిలోల రొయ్యలు పడేవి ఇప్పుడు రోజంతా తిరిగినా కిలో కూడా రావడం లేదు. ఈ సీజన్ లో ఇప్పటివరకు రెండు కిలోల రొయ్యలు దొరకలేదు. సర్కారు మాకు సాయం చేయాలి.– దిలీప్, జాలరి, తుమ్మిడిహెట్టి

