భార్య పుట్టినరోజు మర్చిపోయారా.. అయితే నేరుగా జైలుకే... ఎక్కడంటే...

భార్య పుట్టినరోజు మర్చిపోయారా.. అయితే నేరుగా జైలుకే... ఎక్కడంటే...

మీకు మీ భార్య పుట్టిన రోజు (Wife`s Birthday) గుర్తుందా? ప్రతి సంవత్సరం ఠంచనుగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతారా? ఒకవేళ మీరు మీ భార్య బర్త్‌డే మర్చిపోతే ఆమె అలగవచ్చు లేదా గొడవ పెట్టుకోవచ్చు. అంతకు మించి పెద్ద ప్రమాదం ఉండదు. కానీ, సమోవా దేశస్థులు తమ భార్య పుట్టిన రోజును మర్చిపోవడం చట్ట ప్రకారం నేరం. మొదటి సారి మర్చిపోతే హెచ్చరికతో సరిపెడతారు. రెండోసారి కూడా మర్చిపోయిన వ్యక్తికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష లేదా భారీ జరిమానా పడుతుంది. ఇదెక్కడి చట్టంరా నాయనా అని ఆశ్చర్యపోతున్నారా? అలాంటి కొన్ని వింత రూల్స్ గురించి తెలుసుకుందాం 

ప్రపంచంలో అనేక సాంప్రదాయాలు, వింత ఆచారాలు ఉంటాయి. వీటికితోడు ఆశ్చర్యపర్చే చట్టాలుసైతం ఉంటాయి. ఇలాంటి తరహాలోనే సమోవ దేశంలో ఓ వింత చట్టం ఉంది. భార్య పుట్టినరోజు మరిచిపోవడాన్ని ఆ దేశంలో నేరంగా పరిగణిస్తారు. మొదటి సారి అయితే వార్నింగ్ ఇచ్చి క్షమించి ఒదిలేస్తాయి. రెండోసారీ భార్య పుట్టినరోజును మర్చిపోయారంటూ మగాళ్లు జైలుకెళ్లాల్సిందే. జైలు అంటే పదిరోజులు, ఇరవై రోజులు కాదు.. ఏకంగా ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇలాంటి కేసులను ప్రత్యేకంగా పరిశీలించేందుకు సమోవ దేశంలో పోలీస్ స్పెషల్ టీం కూడా ఉంది.

మారుతున్న కాలానుగుణంగా డబ్బు అవసరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కుటుంబం ఉన్నతంగా జీవించేందుకు డబ్బు సంపాదనకోసం ఎక్కువశాతం మంది పురుషులు ఉద్యోగరీత్యా తీరికలేని బిజీలైఫ్‌ను గడిపేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా భార్య పుట్టినరోజును గుర్తుపెట్టుకొని సెలెబ్రేట్ చేసేవారి సంఖ్య చాలా తక్కువ అనే చెప్పాలి. భార్య పుట్టినరోజు ఎప్పుడో తెలియని భర్తలే ఎక్కువగా ఉంటారు. అయితే, సమోవ దేశంలో అలాకాదు.. ప్రతీ ఒక్కరూ భార్య పుట్టిన రోజు తేదీను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిందే. లేకుంటే ఐదేళ్లు జైలు జీవితం గడిపేందుకు సిద్ధమవ్వాల్సి వస్తుంది.

అందానికి ప్రసిద్ధి చెందిన సమోవ దేశంలో చట్టం ప్రకారం.. భార్య పుట్టినరోజును భర్త తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఒకవేళ భర్త తన భార్య పుట్టినరోజును మర్చిపోతే తొలిసారి హెచ్చరికతో వదిలేస్తారు. అదే తప్పు రెండోసారి జరిగితే భర్తకు భారీ జరిమానాతో పాటు జైలు శిక్షసైతం విధిస్తారు. ఈ వింత చట్టం ప్రకారం.. భర్త ఐదేళ్లు జైలు జీవితం గడపాల్సి ఉంటుంది. అంతేకాదు, ఈ దేశంలో ఈ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేసేందుకు పోలీస్ స్పెషల్ విభాగం ఉంది. పలుసార్లు ప్రత్యేక శిబిరాల ద్వారా ఈ చట్టంపై పోలీస్ స్పెషల్ విభాగం ఈ వింత చట్టంపై అవగాహన సదస్సులుసైతం నిర్వహిస్తారు.  

ఈ చట్టాలు కూడా.. 

సమోవాను చూస్తుంటే ఇదేం దేశంరా బాబూ?ఇలాంటి చట్టాలున్నాయి అని అనిపిస్తోందా? ఇక్కడే కాదు మరికొన్ని దేశాల్లో కూడా ఇలాంటి ఆశ్చర్యకరమైన చట్టాలు, నిబంధనలు ఉన్నాయి. ఉత్తర కొరియాలో బ్లూ జీన్స్‌ ధరించి బయటకు వెళితే సరాసరి జైలుకెళ్లక తప్పదు. తూర్పు ఆఫ్రికాలో బయట జాగింగ్ చేయడం నేరం. సింగపూర్‌లో చూయింగ్‌ గమ్‌ నమలడంపై నిషేధం ఉంది. వాటి వల్ల పరిసరాలు మురికిగా మారుతాయని అక్కడి ప్రభుత్వం దీనిని నేరంగా పరిగణిస్తోంది. అమెరికాలోని ఓక్లహమా రాష్ట్రంలో కుక్కలపై అరిస్తే, తిడితే జైలు ఊచలు లెక్కించక తప్పదు. ఇటలీలోని మిలాన్‌ నగరంలో ఇతరులను చూసి ముఖం చిట్లించడం నేరం.

మీసం ఉన్న మగాడు ముద్దు పెట్టకూడదు..

స్వేచ్ఛ విషయంలో పెద్దగా ప్రతిబంధకాలు ఎదురవని అమెరికాలోని (America) ఓ ప్రాంతంలో ఓ వింత చట్టం అమల్లో ఉంది. నెవడాలోని యురేకా నగరంలో మీసం ఉన్న మగాడు.. ఏ మహిళకూ ముద్దు (Kiss) పెట్టకూడదు. అది చట్ట ప్రకారం నేరం. ఈ చట్టం కూడా చాలా పురాతన కాలం నాటిది.

లోదుస్తులను కలిపి ఉతక్కూడదు..

అమెరికాలోని మిన్నెసోటాలో ఒక విచిత్రమైన చట్టం అమలులో ఉంది. ఆ ప్రాంతంలో స్త్రీలు, పురుషుల లో దుస్తులను (Under Garments) ఒకే వాషింగ్ మెషీన్‌లో ఉతకకూడదు. అలాగే స్త్రీ, పురుషుల లో దుస్తులను పక్క పక్కనే ఆరబెట్టకూడదు. అలా చేయడం అక్కడ చట్టవిరుద్ధం. పురాతన కాలం నాటి ఈ చట్టం ఇప్పటికీ సాంకేతికంగా అమల్లో ఉంది.

రాత్రి పది తర్వాత నో ఫ్లష్

స్విట్జర్లాండ్‌లో రాత్రి 10 గంటల తర్వాత టాయిలెట్‌ని ఫ్లష్ చేయడం నేరం. స్విట్జర్లాండ్‌లో శబ్ద కాలుష్యం చాలా తక్కువగా ఉంటుంది. రాత్రి పది గంటల తర్వాత మరింత నిశబ్దంగా ఉండాలి. అలాంటి సమయంలో టాయ్‌లెట్ ఫ్లష్ చేయడం వల్ల కూడా చుట్టుపక్కల వారికి ఇబ్బంది పడతారాని భావిస్తారు. కాబట్టి రాత్రి 10 గంటల తర్వాత టాయిలెట్‌ను ఫ్లష్ చేయడంపై నిషేధం ఉంది. దీంతో చాలాసార్లు ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

లైటు మార్చకూడదు..

సాధారణంగా మీ ఇంట్లో లైటు పాడైపోయినప్పుడు, మీరు వెంటనే కొత్తది తెచ్చి వేసుకుంటారు. కానీ ఆస్ట్రేలియాలోని (Australia) విక్టోరియాలో అలా చేయడం చట్ట విరుద్ధం. మీరు మీ స్వంత ఇంటి లైట్లను మార్చుకోవడం నేరం. ఎలక్ట్రీషియన్ సర్టిఫికేట్ ఉన్న వ్యక్తి చేత మాత్రమే ఆ పనిని చేయించాలి