రోజంతా కష్టపడి పనిచేశాక, రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతేనే తరువాత రోజు ఉత్సాహంగా ఉంటాం. బెడ్‌రూమ్‌లో మంచి వెలుతురు, చల్లదనం ఉండటమే కాదు.. కొన్ని మొక్కలను పెంచుకోవడం వల్ల గాలి శుభ్రపడి నిద్ర కూడా బాగా పడుతుంది. ఆ మొక్కలు ఏంటో చూద్దామా....
1. స్నేక్ ప్లాంట్
ఈ మొక్క గాలిలోని విషవాయువులను (బెంజీన్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటివి) పీల్చుకుని శుభ్రమైన గాలిని ఇస్తుంది. దీనికి పెద్దగా నీళ్లు పోయక్కర్లేదు, ఎండ లేకపోయినా బతుకుతుంది. చూడటానికి కూడా చాలా స్టైలిష్‌గా ఉంటుంది.
2. పీస్ లిల్లీ
తెల్లని పువ్వులతో చాలా అందంగా ఉండే ఈ మొక్క, గాలిలో ఉండే అమ్మోనియా వంటి మలినాలను దూరం చేస్తుంది. తక్కువ మెయింటెనెన్స్‌తో పెరిగే ఈ మొక్క ప్రశాంతమైన నిద్రకు సహాయపడుతుంది.
3. కలబంద
కలబంద వల్ల చర్మానికి ఎంతో మేలు జరుగుతుందని మనకు తెలుసు. కానీ కలబంద రాత్రిపూట ఆక్సిజన్‌ను విడుదల చేసి గాలిని ఫ్రెష్ గా ఉంచుతుంది. దీనికి తక్కువ నీరు, కొంచెం వెలుతురు ఉంటే చాలు. చిన్న కుండీల్లో కూడా చక్కగా పెరుగుతుంది.
4. మల్లె మొక్క
మల్లె పూల సువాసన మనసును రిలాక్స్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి హాయిగా నిద్ర పట్టేలా చేస్తుంది. దీనిని కిటికీ దగ్గర ఉంచితే, ఆ సువాసన గది అంతా నిండి ప్రశాంతతను ఇస్తుంది.
5. అరెకా పామ్
అరెకా పామ్ గాలిని శుద్ధి చేయడమే కాకుండా, గదిలో తేమ శాతం తగ్గకుండా చూస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ వంటి వాటిని ఈ మొక్క పీల్చుకుంటుంది. బెడ్‌రూమ్ మూలలో దీన్ని పెడితే గదికి మంచి లుక్ వస్తుంది.
6. మనీ ప్లాంట్
చాలామంది ఇళ్లలో ఉండే ఈ మొక్క గాలిలోని విష పదార్థాలను ఫిల్టర్ చేస్తుంది. దీనికి కూడా పెద్దగా టైమ్ కేటాయించక్కర్లేదు. తక్కువ నీటితో, తక్కువ వెలుతురులో ఈ మొక్క అల్లుకుపోతుంది.
7. లావెండర్
లావెండర్ వాసన చూస్తే మెదడు ప్రశాంత పడుతుందని సైన్స్ కూడా చెబుతోంది. నిద్రలేమితో బాధపడేవారికి ఇది చాలా మంచిది. దీనికి కొంచెం ఎండ కావాలి కాబట్టి వెలుతురు వచ్చే చోట పెట్టుకోవడం బెస్ట్. ఈ మొక్కలు మీ గదికి అందాన్ని ఇవ్వడమే కాకుండా, మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.
