హరీశ్​ రావుతో రాజాసింగ్ భేటీ వెనుకున్న అంతర్యమేంటి?

హరీశ్​ రావుతో రాజాసింగ్  భేటీ వెనుకున్న అంతర్యమేంటి?


హైదరాబాద్: బీజేపీ నుంచి సస్పెన్షన్ కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇవాళ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్​ రావుతో భేటీ అయ్యారు.  రాజాసింగ్ పై బీజేపీ పార్టీ విధించిన సస్పెన్షన్ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, బీజేపీతో  సంబంధం లేకుండా పోయింది. రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని హైకమాండ్ కు బండి సంజయ్ పలు మార్లు లేఖలు రాసినా పార్టీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆయన హరీశ్​ రావుతో భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. 

ఇటీవలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన కిషన్ రెడ్డితో రాజాసింగ్ కు విభేదాలు ఉన్నాయని కూడా తెలుస్తోంది. ఇదిలా ఉండగా బీజేపీ జాతీయ నాయకురాలు విజయశాంతి రెండు రోజుల క్రితం  రాజాసింగ్ భద్రతపై ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ రాజాసింగ్ కు భద్రత విషయంలో కేంద్రానికి సరైన నివేదిక ఇవ్వాలని కోరారు. ఆయనకు భద్రత పెంచాల్సిన అవసరం ఉందని విజయశాంతి అభిప్రాయపడ్డారు. 

రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటుకు కారణమేంటంటే..

గత ఏడాది ఆగస్టు 22న సోషల్ మీడియాలో రాజాసింగ్ ఓ వీడియో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా ఉందని ఎంఐఎంతో పాటు ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ అధిష్టానం రాజాసింగ్‌పై  సస్పెన్షన్ వేటు వేసింది. సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌ను అప్పట్లో పార్టీ ఆదేశించింది. బీజేపీ శాసనసభా పక్ష నేత స్థానం నుంచి కూడా పార్టీ ఆయనను తొలగించింది. ఈ వీడియో అప్ లోడ్ చేసినందుకుగాను ఆగస్టు 23న పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అదే రోజు ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆగస్టు 25న రాజాసింగ్‌పై పీడీయాక్ట్ నమోదు చేసి మళ్లీ అరెస్ట్ చేశారు. ఆ తరువాత విడుదలై బయటకు వచ్చారు. 

అభివృద్ధి పనుల కోసమే కలిశా: రాజాసింగ్

తాను అభివృద్ధి పనుల కోసమే మంత్రి హరీశ్ రావును కలిశానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చెబుతున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని ధూల్ పేటలో ఆస్పత్రి కోసమే మంత్రి హరీశ్ రావుతో భేటీ అయినట్టు రాజాసింగ్ చెప్పారు.  తనపై బీజేపీ అధిష్టానం సస్పెన్షన్ ఎత్తివేయని పక్షంలో రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని అంటున్నారు.