దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రైవేట్ టీచర్లకు, సిబ్బందికి ప్రభుత్వ సాయం

దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రైవేట్ టీచర్లకు, సిబ్బందికి ప్రభుత్వ సాయం

కరోనా వైరస్ అన్నిరంగాల్ని కుదిపేస్తోంది. రాష్ట్రంలో విద్యాలయాలు మూసే ఉన్నాయి  ఈ విపత్కర పరిస్థితుల నుండి ప్రైవేట్ స్కూళ్ల సిబ్బందిని ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద మనసుతో దేశంలో ఎక్కడా లేని విధంగా కార్యాచరణ రూపొందించిదన్నారు మంత్రి గంగుల కమలాకర్. మానవతకు మారుపేరుగా నిలిచే  సీఎం కేసీఆర్ ప్రైవేట్ స్కూల్ టీచర్లతో పాటు స్కూళ్లలో పనిచేసే అన్ని రకాల సిబ్బందికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఏప్రిల్ నుండి విద్యాలయాలు ప్రారంభమయ్యే వరకు ప్రతీ నెల 2వేల రూపాయలతో పాటు ప్రతీ ఒక్క ఉద్యోగికి 25కిలోల బియ్యాన్ని అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి నెల దాదాపు 42కోట్ల 57లక్షలు అవసరమవుతాయనే అంచనాతో  పౌరసరఫరాల శాఖ పూర్తి కార్యచరణతో సిద్ధమైందన్నారు. 45 రోజుల్లోనే దీన్ని కంప్లీట్ చేయాలని నిర్ణయించారు. అంతేకాదు దీనికి సంబంధించి ఉపాధ్యాయులు, సిబ్బంది కి సంబంధించిన డాటాను అతి త్వరగా తెప్పించుకుంటామన్నారు మంత్రి గంగుల.

ఇవాళ(శుక్రవారం) బీఆర్కే భవన్లో మంత్రి గంగుల కమలాకర్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో దాదాపు 1లక్షా 45వేల మంది సిబ్బంది వివిద స్థాయిల్లో ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్నారని వారికోసం పౌరసరఫరాల శాఖ ప్రతీనెల 2వేల రూపాయల కోసం దాదాపు 29కోట్ల రూపాయలు, 25కిలోల బియ్యం కోసం దాదాపు  13 కోట్ల 57 లక్షల విలువ గల 3625 మెట్రిక్ టన్నుల దాన్యాన్ని సిద్దం చేసినట్టుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ నెల నుండే గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాలయాల సిబ్బందికి సహాయాన్ని అందిస్తామన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని లబ్దిదారులను రేషన్ షాపుల వారీగా గుర్తించి అందుకు అవసరమైన ఏర్పాట్లను సంపూర్ణంగా రెడీ  చేయాల్సిందిగా కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు.