వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లకు తగ్గకుండా గెలుస్తం.. బీజేపీకి అధికారం కల: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లకు తగ్గకుండా గెలుస్తం.. బీజేపీకి అధికారం కల: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లకు తగ్గకుండా గెలుస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే మూడేండ్ల పాలనపై మరింత ఫోకస్ చేస్తామని చెప్పారు. V6 ఛానెల్‎కు మహేష్ కుమార్ గౌడ్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీకి అధికారం కలేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆ పార్టీకి చోటే లేదన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చాలా గొప్పదని.. పేద ప్రజలకు పని హక్కు కల్పించాలనే లక్ష్యంతో 2005లో యూపీఏ ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకొచ్చిందని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ జాతిపిత అని.. ఆయన లేకుంటే స్వాతంత్ర్యం రాకపోయేదన్నారు.

 అలాంటి గొప్ప నేత పేరును ఉపాధి హామీ పథకానికి పెడితే.. బీజేపీ తొలగిస్తుందని దుయ్యబట్టారు. గాంధీ, నెహ్రూ వంటి విజనరీ లీడర్లను చరిత్ర నుంచి తొలగిస్తున్నారని..కేంద్రంలో మెజార్టీ ఉందని బీజేపీ విచ్ఛలవిడిగా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఇలాగే వ్యవహరిస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు. బీజేపీకి ఎన్నికలు వస్తేనే శ్రీరాముడు, హిందుత్వం గుర్తు వస్తుందని సెటైర్ వేశారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి రాష్ట్రంపై ధ్యాస ఎందుకు లేదని ప్రశ్నించారు. 

తెలంగాణలో గట్టి అపొజిషన్ లేదని.. బీఆర్ఎస్ పార్టీ మూడు ముక్కలు అయిందని అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ దాటడం లేదని.. ఆయన కూతురు కవిత బహిరంగంగానే వాళ్ల లోపాలు చెప్తోందన్నారు. అలాంటి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎందుకు నమ్ముతారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గొప్ప పాలన అందిస్తున్నాడని.. ఇంత మంచి పాలన అందిస్తుంటే ప్రజలు పక్కకు ఎందుకు చూస్తారని అన్నారు. పదేండ్లు రాష్ట్రాన్ని పాలించినోళ్లు వెయ్యికోట్ల పెట్టబడులు కూడా తేలేదని.. మేం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రూ.5 లక్షల కోట్ల పెట్టబడులు తెచ్చామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైజింగ్ మోడ్‎లో ఉందని అన్నారు.