ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి..? దానికోసం ఏం చేయాలి.. ఎన్ని మార్గాలున్నాయి.. అందులో ప్రాథమిక మార్గం ఏమిటి..? అనేది పరమహంస యోగానంద ఒక యోగి ఆత్మకథ గ్రంథంలో వివరించారు. ప్రపంచ ధ్యాన దినోత్సవం (డిసెంబర్ 21) సందర్భంగా ఆత్మ సాక్షాత్కారానికి ఉన్న ప్రాథమిక మార్గం, పరమహంస బోధనలపై అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.
ఆత్మ అంటే మన నిజస్వరూపం అంటారు మహాగురువు యోగానంద. నిజమైన నేను అంటే ఏంటని తెలుసుకోవడమే ఆత్మసాక్షత్కారం. అందుకోసం ఎన్నో మార్గాలున్నా.. ధ్యానం ప్రాథమిక మార్గంగా పేర్కొన్నారు. క్రియాయోగం లాంటి శాస్త్రీయ ధ్యాన మార్గాన్ని అనుసరించడం వల్ల ఉన్నత ఆత్మతో అనుసంధానం చెందుతాం. క్రియా యోగం ఒక సమగ్రమైన, వైజ్ఞానిక, సర్వవ్యాప్త పద్ధతి.
ఏటా డిసెంబర్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రకటించినప్పటి నుంచి.. ప్రపంచ వ్యాప్తంగా ధ్యానంపై ఆసక్తి పెరుగుతోంది. ధ్యానాన్ని భగవంతుడ్ని చేరే మార్గంగా ఆధ్యాత్మికవేత్తలు నిర్వచిస్తుంటారు. ప్రతిరోజూ కొంచెం సమయమైనా ధ్యానంలో గడిపితే మనం మన ప్రశాంతత స్థాయిలను, శారీరక ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగు పరుచుకోగలుగుతాం.
పశ్చిమ దేశాలలో యోగ పితామహునిగా విస్తృతంగా గుర్తింపు పొంది, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన "ఒక యోగి ఆత్మకథ" (Autobiography of a Yogi) గ్రంథ రచయిత అయిన పరమహంస యోగానంద, మానవులందరికీ ధ్యానం అత్యంత ప్రాముఖ్యత కలిగినదని నొక్కి చెప్పారు.
యోగ మార్గంలో ధ్యాన సాధన ఒక అంతర్భాగం. పరమహంస యోగానంద ద్వారా 1917లో స్థాపించబడిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) , ఆ మహాగురువు ఉపదేశించిన క్రియాయోగ బోధనలను వ్యాప్తి చేస్తుంది. ఈ బోధనలు ఆత్మసాక్షాత్కారం అనే ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి ప్రాథమిక మార్గంగా క్రమం తప్పకుండా చేసే గాఢమైన ధ్యానానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తాయి.
హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం క్రమం తప్పకుండా ధ్యానం చేసే సీఈఓలు వారి వృత్తి జీవితంలో కూడా స్పష్టంగా మరింత విజయవంతంగా ఉంటారని వెల్లడించింది. సైకాలజిస్టులు కూడా ఆరోగ్యకరమైన, సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవితాలను గడపడానికి ధ్యానాన్ని ఒక అద్భుతమైన మార్గంగా ప్రతిపాదిస్తారు.
మరింత సమాచారం కోసం: yssofindia.org
