Ashes 2025-26: వారిద్దరూ నా చిన్ననాటి హీరోలు.. మెక్‌గ్రాత్‌ రికార్డ్ బ్రేక్ చేసిన తర్వాత లియాన్ కామెంట్స్

Ashes 2025-26: వారిద్దరూ నా చిన్ననాటి హీరోలు.. మెక్‌గ్రాత్‌ రికార్డ్ బ్రేక్ చేసిన తర్వాత లియాన్ కామెంట్స్

ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ అరుదైన మైలుస్టోన్ చేరుకున్నాడు. ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా నిలిచాడు. ఈ క్రమంలో దిగ్గజ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌ను వెనక్కి నెట్టాడు. లియాన్ ఖాతాలో 564 టెస్ట్ వికెట్లు ఉన్నాయి. మరోవైపు మెక్‌గ్రాత్‌ 563 వికెట్లతో మూడో స్థానానికి పడిపోయాడు. ఇంగ్లాండ్ తో ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ మూడో టెస్టులో ఈ వెటరన్ ఆఫ్ స్పిన్నర్ ఈ ఘనతను అందుకున్నాడు. రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ బ్యాటర్ పోప్ వికెట్ తీసి మెక్‌గ్రాత్‌ను సమం చేసిన లియాన్.. ఆ తర్వాత బెన్ డకెట్ ను బౌల్డ్ చేసి 564 వికెట్లతో మెక్‌గ్రాత్‌ను వెనక్కి నెట్టాడు.

లియాన్ టెస్ట్ కెరీర్ ను చూసుకుంటే 141 టెస్టుల్లో 30.09 యావరేజ్ తో 564 వికెట్లు పడగొట్టాడు. 8/50 అతని అత్యుత్తమ గణాంకాలు ఉన్నాయి. లియాన్ ఖాతాలో 26 సార్లు నాలుగు వికెట్లు ఘనత.. 24 సార్లు ఐదు వికెట్లు ఘనత.. 10 సార్లు మ్యాచ్ లో 10 వికెట్ల ఘనతలు ఉన్నాయి. మెక్‌గ్రాత్ కెరీర్‌ను చూసుకుంటే 124 టెస్టుల్లో 21.64 సగటుతో 562 వికెట్లు పడగొట్టాడు. 8/24 ఈ ఆసీస్ పేసర్ అత్యుత్తమ గణాంకాలు. లియాన్ కంటే షేన్ వార్న్ మాత్రమే ఆస్ట్రేలియా తరపున ముందున్నాడు. షేన్ వార్న్ టెస్ట్ క్రికెట్ లో 145 మ్యాచ్ లాడి 25.41 సగటుతో 708 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 

రెండో రోజు ఆట ముగిసిన తర్వాత లియాన్.. గ్లెన్ మెక్‌గ్రాత్‌ను అధిగమించడం ప్రత్యేకమైన క్షణం అని తెలిపాడు."నేను షేన్ వార్న్, గ్లెన్ మెక్‌గ్రాత్‌లను ఆరాధిస్తూ పెరిగాను. వీరిద్దరూ నా చిన్ననాటి హీరోలు. గ్లెన్‌ను అధిగమించగలగడం చాలా వినయంగా, గొప్పగా ఉంది. ఇది నాకు చాలా ప్రత్యేకమైన క్షణం," అని పోస్ట్-డే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో లియాన్ చెప్పుకొచ్చాడు. యాషెస్ లో భాగాంగా తొలి రెండు టెస్టుల్లో లియాన్ కు ఆడే అవకాశం రాలేదు. మూడో టెస్టులో ప్లేయింగ్ 11 లోకి వచ్చి తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. రెండో ఇన్నింగ్స్ లో మరో 3 వికెట్లు పడగొట్టి తన వికెట్ల సంఖ్యను 567కు పెంచుకున్నాడు.