
- డీఈవోలకు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ టీచర్లు క్లాస్‌రూమ్‌లో సెల్ ఫోన్లు వాడితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా ఆదేశించారు. సర్కారు విద్యాసంస్థల్లో అడ్మిషన్ల పెంపునకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. మూడు రోజుల నుంచి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరుగుతున్న డీఈవోలు, ఆర్జేడీలు, డైట్ ప్రిన్సిపాళ్లకు శిక్షణా తరగతులు ఆదివారంతో ముగిశాయి.
ఈ సందర్భంగా యోగితారాణా మాట్లాడుతూ.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతి గదుల్లో ఫోన్లు వాడొద్దనే దానిపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డీఈవోలకు సూచించారు. స్కూళ్లను ఆకస్మిక తనిఖీలు చేసి, ఇది స్పష్టంగా అమలు జరిగేలా చూడాలన్నారు. సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపునకు బడిబాటను ఉపయోగించుకోవాలని సూచించారు. టీచర్లు రంగయ్య, మాధవి, రవిరాజు తదితరుల అనుభవాలను చెప్పించారు. ఈ సమావేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ లింగయ్య, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్, తదితరులు పాల్గొన్నారు.