డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. గిగ్ వర్కర్ల చట్టానికి గవర్నర్ ఆమోదం.. మే డే సందర్భంగా గెజిట్నోటిఫికేషన్

డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. గిగ్ వర్కర్ల చట్టానికి గవర్నర్ ఆమోదం.. మే డే సందర్భంగా గెజిట్నోటిఫికేషన్
  • 10 నుంచి 15 రోజుల్లో  గైడ్​లైన్స్​పై ఉత్తర్వులు
  • అగ్రిగేటర్స్, గిగ్ ​వర్కర్లతో ప్రత్యేక సమావేశానికి కసరత్తు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు సహా అసంఘటిత రంగంలోని లక్షలాది మంది గిగ్ వర్కర్ల చిరకాల స్వప్నం సాకారమైంది. చాలీచాలని వేతనాలు, పని ఒత్తిడి, సరైన సామాజిక భద్రత లేక సతమతమవుతున్న కార్మికులకు భరోసా కల్పిస్తూ రూపొందించిన ‘తెలంగాణ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ -2026 బిల్లుకు’కు రాష్ట్ర గవర్నర్ గురువారం ఆమోదముద్ర వేశారు. మే డేను పురస్కరించుకొని ప్రభుత్వం నేడు(శుక్రవారం) గెజిట్ నోటిఫికేషన్‌‌‌‌ విడుదల చేయనుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడగానే, రాష్ట్రంలో గిగ్ వర్కర్ల హక్కులకు చట్టబద్ధత లభించనుంది. 

  • గైడ్​లైన్స్​ రూపొందించేందుకు ప్రత్యేక సమావేశం

యాప్ ఆధారిత అగ్రిగేటర్ల వద్ద పనిచేస్తున్న కార్మికులకు పని భద్రతతో పాటు, ప్రమాద, ఆరోగ్య బీమా,  ఇతర సామాజిక భద్రతా పథకాలను వర్తింపజేయడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యం. కేవలం చట్టం చేయడం వరకే పరిమితం కాకుండా అది క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు కావడానికి అగ్రిగేటర్లు (స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్ వంటి సంస్థలు)  గిగ్ వర్కర్ల సంఘాలతో కార్మికశాఖ అధికారులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. 

ఇందుకోసం కార్మిక శాఖ మంత్రి వివేక్​వెంకటస్వామి ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశంలో కార్మికుల పనివేళలు, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం, సంక్షేమ నిధి వంటి కీలక అంశాలపై చర్చించి తుది మార్గదర్శకాలను రూపొందిస్తారు. మరో 10 నుంచి 15 రోజుల్లో ఈ గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌పై పూర్తిస్థాయి ఉత్తర్వులు వెలువడే అవకాశముందని ఆఫీసర్లు చెప్తున్నారు. 

ఈ చట్టం అమలుతో గిగ్ ఎకానమీలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు కంపెనీల ఇష్టారాజ్యంగా ఉన్న నిబంధనలకు ఇకపై చెక్​పడనుంది. కార్మికుల నుంచి వసూలు చేసే సేవా రుసుముల్లో కొంత భాగాన్ని వారి సంక్షేమ నిధికి మళ్లించడం ద్వారా కార్మికులకు లబ్ధిచేకూరనుంది.