- 90 శాతం పైగా పాస్ పర్సంటేజ్
- అభినందనలు తెలిపిన సీఎం, మంత్రులు
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ రిజల్ట్స్ లో గురుకుల స్టూడెంట్స్ సత్తా చాటారు. బీసీ, ఎస్టీ, ఎస్టీ గురుకులాల్లో చదువుతున్న స్టూడెంట్స్ ప్రైవేట్ విద్యార్థులతో సమానంగా మార్కులు ర్యాంకులు సాధించారు. బీసీ గురుకులాల్లో సీనియర్ ఇంటర్ లో స్టేట్ ర్యాంక్ సాధించిన బైపీసీ విద్యార్థి శ్రియ (994), బి. హిమానీ(993), రాథోడ్ నందు (993), ఎంపీసీలో బి. మధు(994), శ్రీనిధి(994), సీఈసీ శ్రీలత(981), ఎంఈసీ జాహ్నవి (983), హెచ్ ఈసీ రాజేశ్వరి(980) అత్యుత్తమ మార్కులు సాధించినట్లు సెక్రటరీ సైదులు వెల్లడించారు.
సీనియర్ ఇంటర్ లో పది లోపు ర్యాంక్ లు ఎంపీసీలో 97 మంది, బైపీసీ లో 62 మంది విద్యార్థులు సాధించారని ఆయన తెలిపారు. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ర్యాంక్(468) సాధించిన 16మంది ఎంపీసీ విద్యార్థులు, బైపీసీలో 438 మార్కులు సాధించిన 11మంది విద్యార్థులు , సీనియర్ ఇంటర్ ఫలితాల్లో 33కాలేజీల్లో వందశాతం ఉత్తీర్ణత, జూనియర్ ఇంటర్ లో 9 కాలేజీల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు సెక్రటరీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ర్యాంకర్లను సీఎం రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.
ఉత్తమ మార్కులు సాధించిన ఎస్టీ స్టూడెంట్స్
ఇంటర్ ఫలితాల్లో సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు సత్తా చాటారు. గతేడాదికంటే ఈ సారి ఉతీర్ణత శాతం పెరగడంపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఫస్టియర్ఇంటర్ఫలితాల్లో 226 గురుకుల నుంచి మొత్తం 13,611 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే.. అందులో 10,588 మంది 77. 79 శాతం ఉత్తీర్ణత సాధించారని సెక్రటరీ సీతాలక్ష్మి వెల్లడించారు. 12 విద్యాసంస్థల్లో 100 శాతం ఫలితాలు సాధించారు.
ఇక సెకండియర్ఫలితాల్లో 235 గురుకుల విద్యాసంస్థల నుంచి 13,481 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే.. అందులో 11,894 మంది 88. 22 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆమె తెలిపారు. ఎంపీసీలో 470లో ఏడుగురు స్టూడెంట్స్ 468 మార్కులు, బైపీసీలో ఐదుగురు స్టూడెంట్స్ 440లో 438 మార్కులు సాధించినట్లు సెక్రటరీ తెలిపారు. ఎంపీసీలో 1000లో ఇద్దరు స్టూడెంట్స్ 995 మార్కులు సాధించారన్నారు. గురుకుల విద్యార్థుల ఉత్తీర్ణత పై వెల్ఫేర్ స్పెషల్ సీఎస్ సభ్యసాచి ఘోష్ గ్రీటింగ్స్ తెలిపారు.
