
గజ్వేల్, వెలుగు: దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించి దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కొల్గూరు గ్రామానికి చెందిన 129 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను.. ట్రాక్టర్లు, వ్యాన్ల తాళాలను అందజేశారు. తర్వాత జగవదేవ్పూర్ మండలం కొత్తపేట, ఇటిక్యాల, లింగారెడ్డి పల్లి గ్రామాల ఇనాం భూముల రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. ఆపై గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. దళితులు అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించాలన్న జగ్జీవన్ కలలు దళిత బంధు ద్వారా సాకారమయ్యాయన్నారు. ఈ పథకం దళితుల జీవితాల్లో మార్పు తేవాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రారంభించారని చెప్పారు.
ధరణితో అవినీతి తగ్గింది
ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత రైతుల భూముల సమస్యలు పరిష్కారమయ్యాయని, అవినీతి తగ్గిందని మంత్రి హరీశ్ చెప్పారు. పాస్ బుక్ లు, టైటిల్ డీడ్ల కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే బాధలు తీరాయన్నారు. ధరణిలో పెండింగ్ భూ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టామని చెప్పారు. తెలంగాణ సర్కారు వచ్చాక సాగునీటి, కరెంట్ సమస్యలకు పరిష్కారం చూపామన్నారు. కేంద్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువులతో సహా అన్ని వస్తువుల రేట్లను పెంచినందున పంట పెట్టుబడి వ్యయం ఎన్నడూ లేనివిధంగా పెరిగి రైతులకు భారంగా మారుతోందన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనమంటే తెలంగాణ ప్రజలను నూకలు తినమని కేంద్ర మంత్రులు ఎద్దేవా చేస్తున్నారని మండిపడ్డారు.