బిక్కనూర్-కామారెడ్డి హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్.. 20 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

బిక్కనూర్-కామారెడ్డి హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్.. 20 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

హైదరాబాద్: కామారెడ్డి జిల్లాపై వరుణుడు ఉగ్రరూపం చూపించాడు. బుధవారం (ఆగస్ట్ 27) కురిసిన రికార్డ్ స్థాయి వర్షంతో కామారెడ్డి అతలాకుతలం అయ్యింది. వరద ధాటికి చాలా ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో వరద నీరు భారీగా రోడ్లపైకి చేరింది. వరదలకు రోడ్ల దెబ్బ తినడంతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

ఎడతెరిపి లేని వర్షంతో జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. ఈ క్రమంలోనే వరద భారీగా రోడ్డుపైకి రావడంతో బిక్కనూర్-కామారెడ్డి హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. బిక్కనూర్ టోల్ ప్లాజా నుంచి కామారెడ్డి వరకు జాతీయ రహదారిపై ఎక్కడికక్కడే వాహనాలు  నిలిచిపోయాయి. సుమారు 20 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు నిమిషానికి 10 మీటర్లు కూడా ముందకు కదలేని పరిస్థితి నెలకొంది. 

భారీ ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ట్రాఫిక్ నివారణ చర్యలు చేపట్టారు. కామారెడ్డి హైదరాబాద్ నేషనల్ హైవే 44 తీవ్రంగా దెబ్బ తినడంతో ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టారు పోలీసులు. వాహనాలను ప్రత్యమ్నాయ మార్గాల్లో పంపిస్తున్నారు. వర్షంతో కామారెడ్డి అల్లకల్లోలం కావడంతో ఇవాళ (ఆగస్ట్ 28) జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. జిల్లా కలెక్టర్, అధికారులు అంతా ఎప్పటికప్పుడు పరిస్థిని పర్యవేక్షిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహయక చర్యలు చేపట్టారు.