
- పంజాగుట్ట రోడ్డు ప్రమాదంపై పిటిషన్ డిస్మిస్
హైదరాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాద కేసు నుంచి తన కొడుకును తప్పించేందుకు బీఆర్‌ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ చేసిన ప్రయత్నాలు హైకోర్టులో బెడిసికొట్టాయి. రోడ్డు ప్రమాదం కేసు నుంచి కుమారుడు రాహిల్ అమీర్‌ను తప్పించడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ షకీల్‌తోపాటు రాహిల్ బదులు డ్రైవర్‌గా ఉన్న అబ్దుల్ ఆసీఫ్, ఇతరులు వేర్వేరుగా మూడు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని కొట్టివేస్తూ జస్టిస్ కె. లక్ష్మణ్ మంగళవారం తీర్పు చెప్పారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ తరపున శాలినీ మిశ్రా వాదిస్తూ.. రోడ్డు ప్రమాద కీలక వ్యక్తి రాహిల్ అమీర్ విదేశాలకు పారిపోయాడని చెప్పారు. డ్రైవర్ గుర్తింపునకు నిర్వహించిన కార్యక్రమానికి రాహిల్ డుమ్మా కొట్టారని, అతనే నిందితుడని చెప్పారు. 68 మంది సాక్షుల విచారణ జరిగిందన్నారు. ఈ వాదనల తర్వాత హైకోర్టు, కేసు దర్యాప్తు దశలో పిటిషన్లను ఆమోదించలేమని తేల్చి చెప్పింది. మూడు పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు తీర్పులో పేర్కొంది.