- మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లా రావిర్యాల వద్ద గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి చేపట్టిన భూసేకరణ ప్రక్రియపై స్టేటస్‌కో కొనసాగించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ భూసేకరణ ప్రక్రియ హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని తేల్చి చెప్పింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 29వ తేదీకి వాయిదా వేసింది. గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణం కోసం గత ఏడాది అక్టోబరులో జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ఎన్.మౌనిక మరో 29 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది జె.రామచంద్రరావు వాదిస్తూ..ఔటర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం 447 ఎకరాలు సేకరిస్తోందన్నారు.
ఇందులో పిటిషనర్లకు చెందిన 36 ఎకరాలను సేకరిస్తోందన్నారు. ఈ భూసేకరణ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతోందన్నారు. అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ..మొత్తం 447 ఎకరాలు సేకరిస్తున్నామని, ఎక్కువ మంది ఇప్పటికే అంగీకరించి పరిహారం తీసుకున్నారన్నారు. పరిహారం తీసుకున్నవారిలో పిటిషనర్లు కూడా ఉన్నారన్నారు. సెక్షన్ 15(1) విచారణలో పాల్గొన్నారని, వారు ఇచ్చిన వినతి పత్రాలను పరిష్కరించామన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్ల భూములపై యథాతథ స్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు

