వాట్సాప్ ద్వారా విరాళాలతో ముసలవ్వకు ఇల్లు

వాట్సాప్ ద్వారా విరాళాలతో ముసలవ్వకు ఇల్లు

యాదాద్రి భువనగిరి జిల్లా: ఓ పేద ముసలవ్వకు గూడు కల్పించి మంచి మనసు చాటుకుంది ఓ స్వచ్ఛంద సంస్థ. భువనగిరి మండలంలోని సూరేపల్లి గ్రామంలో ఉండటానికి ఇల్లు లేని నిరూపేద ముసలవ్వ (మేకల నర్సమ్మ)కు సోల్జర్స్ క్లబ్ ద్వారా విరాళాలు సేకరించి చిన్న ఇంటిని నిర్మించారు. ఇంటి నిర్మాణం పూర్తి కావడంతో మంగళవారం నూతన గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సోల్జర్స్ క్లబ్ ఛైర్మన్ పాశం శివానంద్ మాట్లాడుతూ.. 100 మంది క్లబ్ మెంబర్ల సహకారంతో రూ. 50 వేలు సేకరించి, మరొక 20 వేల రూపాయలు తన సొంత డబ్బులతో ఇల్లును నిర్మించామన్నారు. ముసలవ్వ బాధను చూడలేక ఇటీవల వాట్సాప్ లో స్టేటస్ పెట్టానని..ఇందుకు దాతలు ముందుకు వచ్చి తోచిన సాయం చేశారన్నారు.  మొత్తం రూ. 70 వేల పైన ఖర్చుతో రెండు నెలల్లోనే ఇంటిని నిర్మించామన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఆ ముసలవ్వ భర్త ఇటీవలే మరణించారని చెప్పుకొచ్చారు.  ప్రస్తుతం ఒంటరిగా ఉన్న ఆ ముసలవ్వను ఇంట్లోకి చేర్చి, ఆమెకు ప్రస్తుతానికి సరిపడ నిత్యావసర సరుకులు అందజేశామని చెప్పారు.  ఈ సందర్భంగా ముసలవ్వ తనకు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు.