- కొత్త బొగ్గు గనులు రాకుండా అడ్డుకున్నరు: మంత్రి వివేక్
- ఇక్కడి ప్రజల సొమ్మును ఎందుకు తరలించుకుపోయారో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలి
- 85 శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని ధీమా
- క్యాతనపల్లి, చెన్నూరులో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం
కోల్‌బెల్ట్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సింగరేణి నిధులను గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటకు తరలించి.. చెన్నూరు అభివృద్ధిని విస్మరించారని మంత్రి వివేక్ వెంకటస్వామి ధ్వజమెత్తారు. సింగరేణి ప్రాంత ప్రజల కోసం ఖర్చు చేయాల్సిన డీఎంఎఫ్టీ ఫండ్స్.. సిద్దిపేటకు తరలించుకుపోయి అక్కడ పెద్ద స్టేడియం కట్టించారని అన్నారు. ఇక్కడి ప్రజల సొమ్ము ఎందుకు తరలించుకుపోయారో క్యాతనపల్లి ప్రచారానికి వస్తున్న హరీశ్‌రావు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి,చెన్నూరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్అభ్యర్థుల తరఫున మంత్రి ప్రచారం చేశారు. పలుచోట్ల కార్నర్మీటింగుల్లో మాట్లాడారు. చెన్నూరులో బ్రాహ్మణ సామాజిక వర్గం సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 85శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. బొగ్గు బ్లాక్‌ల కేటాయింపు కోసం కేంద్రం నిర్వహించిన వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనకుండా బీఆర్ఎస్ సర్కార్ అడ్డుకుందని, దానివల్ల సింగరేణికి కొత్త బొగ్గుగనులు రాలేదన్నారు. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో కాలుష్యం ఇతర సమస్యలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు డీఎంఎఫ్టీ, సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేయాలని కేంద్రం చట్టం చేసిందని, అందుకు భిన్నంగా సింగరేణి ప్రాంత ప్రయోజనాలు, అభివృద్ధిని విస్మరించి ఆ నిధులను కేటీఆర్, హరీశ్ తమ నియోజకవర్గాలకు తరలించుకపోయారని మండిపడ్డారు. సింగరేణి నిధులను కేసీఆర్ కుటుంబసభ్యులు తరలించుకు వెళ్తుంటే.. బాల్క సుమన్ ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. సుమన్ పదేండ్లలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ప్రజలను పట్టించుకోకుండా.. కేసీఆర్ సేవలకే పరిమితమయ్యాడన్నారు. చెన్నూరు నియోజవర్గంలో కేవలం 250 డబుల్బెడ్రూం ఇండ్లు కట్టారని.. మిగిలిన2లక్షల మందికి అన్యాయం చేశారని విమర్శించారు.
భూములిచ్చిన రైతులను అరిగోస పెట్టిన్రు..
బీఆర్ఎస్ పాలకులు కమీషన్ల కోసమే మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని మంత్రి వివేక్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కోటపల్లి మండలం బబ్బెరచెలక, దేవులవాడ, లక్ష్మిపూర్ రైతుల నుంచి భూములు తీసుకున్నారని, వారికి రావాల్సిన రూ.33కోట్ల పరిహారం ఇవ్వకుండా బీఆర్ఎస్ పాలకులు నాలుగేండ్లు అరిగోస పెట్టారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యే కాగానే ప్రభుత్వాన్ని ఒప్పించి భూములు కోల్పోయిన రైతులకు రూ. 28 కోట్ల పరిహారం మంజూరు చేయించానని, త్వరలో పరిహారం పంపిణీ చేస్తామన్నారు. రైతులపై చిత్తశుద్ధి ఉంటే అప్పుడు మంత్రిగా ఉన్న హరీశ్‌రావు పరిహారం ఎందుకు ఇప్పించలేదని ప్రశ్నించారు. రూ.60వేల కోట్ల మిషన్ భగీరథ స్కీం నుంచి చుక్కనీళ్లు రాలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిని ప్రపంచ ధనవంతుడిని చేసిన బీఆర్ఎస్వేల కోట్ల కమీషన్లు దండుకుందన్నారు.
పదేండ్లలో ఆర్వోబీ కనెక్టింగ్ రోడ్డు నిర్మించలేదు
తాను పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద ఆర్వోబీ శాంక్షన్ చేయించానని.. పదేండ్లు గడిచినా బాల్క సుమన్ ఆర్వోబీకి కనెక్టింగ్ రోడ్ పూర్తి చేయించలేదని మంత్రి ఆరోపించారు. కనెక్టింగ్ రోడ్ నిర్మాణంలో జాప్యం వల్ల గేటు వద్ద ప్రమాదాలు జరిగి పలువురు చనిపోయారన్నారు. తిరిగి తాను ఎమ్మెల్యే అయిన తర్వాత కనెక్టింగ్ రోడ్ నిర్మించి ఆర్వోబీని అందుబాటులోకి తెచ్చానన్నారు. చెన్నూరు-, భీమారం మధ్య నేషనల్ హైవే 63లోని జోడువాగుల వద్ద కొత్త రోడ్డు కోసం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, తాను కలిసి రూ.100కోట్లు నిధులు మంజూరు చేయించామని, రూ.2కోట్లతో టెంపరరీ రోడ్డును నిర్మించామన్నారు. క్యాతనపల్లి, చెన్నూరు, మందమర్రిల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు రూ.100కోట్ల నిధులతో అమృత్స్కీం పనులు చేపట్టామని, ఆరునెల్లల్లో ఇంటింటికి తాగునీరు అందిస్తామన్నారు. జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లో 800మెగావాట్ల మూడో యూనిట్‌ను నిర్మించబోతున్నా మన్నారు. కొత్తగా వచ్చే ఆర్కేపీ ఓపెన్‌కాస్ట్ రెండో ఫేజ్ గని ద్వారా వల్ల స్థానికులకు వేలాది ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రచారంలో మంత్రి వెంట కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.
