- పేషెంట్ నగలు దొంగిలించిన మహిళ అరెస్ట్
- 7 తులాల బంగారం, 2 తులాల వెండి రికవరీ
మియాపూర్, వెలుగు: హాస్పిటల్లో రోగి సహాయకుల కళ్లుగప్పి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన హౌజ్ కీపింగ్ మహిళను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ రమేశ్ నాయుడు వివరాల ప్రకారం.. చందానగర్ శివాజీ నగర్‌కు చెందిన జె.దుర్గ (45) మదీనగూడలోని ఓ కార్పొరేట్హాస్పిటల్లో హౌజ్ కీపింగ్ సిబ్బందిగా పనిచేస్తుంది. గత నెల 25న చందానగర్ అపర్ణ హిల్ పార్క్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన భార్యను చికిత్స నిమిత్తం హాస్పిటల్లో చేర్చాడు.
ఆమె ఎస్‌ఐసీయూలో ఉండగానే కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో దుర్గ లోపలికి ప్రవేశించి, భర్త కళ్లుగప్పి బ్యాగు నుంచి 7 తులాల బంగారం, వెండి వస్తువులను అపహరించింది. మరుసటి రోజు ఉదయం నగలు మాయమైనట్లు గుర్తించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలో దుర్గ అనుమానాస్పదంగా గదిలోకి వెళ్లడం, డ్యూటీ ముగిశాక భద్రతా తనిఖీల నుంచి తప్పించుకోవడం రికార్డ్ అవ్వడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి వద్ద నుంచి సుమారు 7 తులాల బంగారం, 2.5 తులాల వెండిని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.
