నగరానికి వచ్చే రూట్లన్నీ బిజీబిజీ.. విజయవాడ-హైదరాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్ జాం..

నగరానికి వచ్చే రూట్లన్నీ బిజీబిజీ.. విజయవాడ-హైదరాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్ జాం..

హైదరాబాద్ దారులన్నీ ట్రాఫిక్ తో కిక్కిరిసి పోయాయి. హైవేల పై కిలో మీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయాయి. దసరా పూర్తి చేసుకుని నగరానికి తిరుగు ప్రయాణం అవ్వటంతో సోమవారం (అక్టోబర్ 06) ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం అయ్యింది. వాహనదారులు ట్రాఫిక్ లో చిక్కుకుని చుక్కలు చూస్తున్నారు. 

విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పండుగకు స్వంత ఊర్లకు వెళ్లి తిరుగు ప్రయాణంతోనే రోడ్లపై కనుచూపు మేర వాహనాలు బారులు తీరాయి. వెహికిల్స్ స్లోగా కదులుతుండటంతో.. ఇంకెప్పుడొస్తుందా హైదరాబాద్ అన్నట్లుగా ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. చౌటుప్పల్ ఏరియాలో వాహనాలు బారులు తీరాయి.పంతంగి టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో.. ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

రంగారెడ్డి జిల్లా నార్సింగి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.  బండ్లగూడ జాగీర్ చౌరస్తా నుంచి కాళీ మందిర్ వరకు ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలియిపోవడంతో హారన్ సైరన్ లతో రోడ్లు మార్మోగుతున్నాయి. 

ఇటు సిటీలోనూ భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. సోమవారం (అక్టోబర్ 06) ఉదయం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం కారణంగా సిటీలో ట్రాఫిక్ జామ్ అయ్యింది.

పండుగకు సొంత ఊర్లకు వెళ్లి వస్తున్న జనంతో సిటీలో ట్రాఫిక్ రద్ధి మొదలైంది. రాయదుర్గం, గచ్చిబౌలి, ఖాజాగూడా, నానక్ రామ గూడా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కారణంగా ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది.