- ట్రాఫిక్ కష్టాలకు చెక్
- దుర్గం చెరువు పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: హైటెక్ సిటీ పరిధిలోని దుర్గం చెరువు పరిరక్షణతో పాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నడుం బిగించింది. నిత్యం లక్షలాది మంది ప్రయాణించే మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇక్కట్లను తొలగించేందుకు వాటర్ బోర్డు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్, ఇరిగేషన్, విద్యుత్ శాఖలు, టీజీఐఐసీ సంయుక్తంగా జాయింట్ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నాయి.
ఇందులో భాగంగా ట్రైడెంట్ హోటల్ నుంచి శిల్పారామం వరకు, అలాగే లెమన్ ట్రీ హోటల్ నుంచి మెడికవర్ ఆసుపత్రి వరకు రోడ్డు విస్తరణ పనులను మున్సిపల్ కమిషనర్ సృజన, వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డితో పాటు పోలీసు అధికారులు కలిసి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పనులకు అడ్డుగా ఉన్న ఎయిర్ వాల్వ్‌లు, విద్యుత్ స్తంభాలను వెంటనే తరలించి, విస్తరణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
మరోవైపు, దుర్గం చెరువులోకి మురుగునీరు చేరకుండా అడ్డుకట్ట వేసేందుకు మాదాపూర్ ఐఅండ్‌డీ వరకు1000 ఎంఎం డయా పైపులైన్ పనులను వేగవంతం చేయాలని, రహేజా మైండ్ స్పేస్ వంటి ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు, గార్డెనింగ్‌కు కేవలం ఎస్టీపీలలో శుద్ధి చేసిన నీటినే వాడాలని అధికారులు ఆదేశించారు.
