హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థుల వివరాలను వారంలోపు సమర్పించాలని కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు. ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల సమీక్ష సమావేశంలో డీఆర్వో వెంకటాచారితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ---–పాస్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌కు డిసెంబర్ 15 చివరి తేదీ కావడంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టి కుల-, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో కూడిన విద్యార్థుల వివరాలను తహసీల్దార్లకు అందించాలన్నారు.
5 నుంచి 8వ తరగతి ఎస్సీ, ఎస్టీ బాలురకు రూ.1,000, బాలికలకు రూ.1,500; రాజీవ్ విద్యా దీవెన కింద 9,10వ తరగతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.3,500; బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.4,000 స్కాలర్షిప్ అందించనున్నట్లు తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలని, ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్ ముందు పేజీ జిరాక్స్, పాస్‌పోర్ట్ ఫొటోలతో మీసేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. రిజిస్టర్ కాని స్కూల్స్ https://telanganaepass.cgg.gov.in ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఆర్‌డీవోలు రామకృష్ణ, సాయిరాం, సంక్షేమ అధికారులు ప్రవీణ్, ఆశన్న, కోటాజి పాల్గొన్నారు.
