ఫీజు బకాయి వసూళ్ల పై హైకోర్టు తీర్పు బాధాకరం : ఎంపీ ఆర్.కృష్ణయ్య

ఫీజు బకాయి వసూళ్ల పై హైకోర్టు తీర్పు బాధాకరం : ఎంపీ ఆర్.కృష్ణయ్య

బషీర్​బాగ్, వెలుగు: కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజు బకాయిలు వసూలు చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం బాధాకరమని ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. హైకోర్టు తీర్పు 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్​కు గొడ్డలి పెట్టు లాంటిందన్నారు. శుక్రవారం బషీర్​బాగ్ ప్రెస్ క్లబ్​లో ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం సరైన వాదనలు వినిపించకపోవడం వల్లే ఇటువంటి తీర్పు వచ్చిందని విమర్శించారు.

అడ్వకేట్ జనరల్ అసమర్థతను ప్రభుత్వం కప్పిపుచ్చుకుంటూ, ఫీజు రీయింబర్స్​మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ తీర్పుపై అప్పీల్ చేయాలని, బకాయి ఉన్న రూ.6 వేల కోట్ల ఫీజులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వ పాలనను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ నేతలు రాజేందర్, రాందేవ్, మల్లేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ మంత్రులు రాజీనామా చేయాలి

బీసీ విద్యార్థుల ఉన్నత విద్యకు భరోసా ఇచ్చే ఫీజు రీయింబర్స్​మెంట్ పథకాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సైఫాబాద్​లోని బీసీ జేఏసీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. గత ఐదేండ్లుగా బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వేలాది మంది చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేయాలన్న హైకోర్టు నిర్ణయం పేదవారిపై తీరని భారమని, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం జరుగుతున్నా మౌనంగా ఉన్న బీసీ మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.