V6 News

కోర్టులకు హైడ్రా అతీతమా? : హైకోర్టు 

కోర్టులకు హైడ్రా అతీతమా? : హైకోర్టు 
  • సమాంతర ప్రభుత్వం నడుపుతోందా: హైకోర్టు 
  • కోర్టు వివాదాల్లోని భూముల్లో బోర్డులు పెట్టడంపై ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: కోర్టు వివాదాల్లో ఉన్న స్థలాల్లో ఇది ప్రభుత్వ స్థలమంటూ కంచె వేసి, బోర్డులు ఏర్పాటు చేస్తున్న హైడ్రా తీరుపై హైకోర్టు మండిపడింది. న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకపోవడంపై కోర్టులకు అతీతంగా పని చేస్తోందా? ఏమైనా సమాంతర ప్రభుత్వం నడుపుతోందా అంటూ నిలదీసింది. కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో పెట్టిన బోర్డును తక్షణం తొలగించాలని ఆదేశించింది. మేడ్చల్‌ మల్కాజ్ గిరి జిల్లాలోని సూరారం లో తమ ఆస్తిని హైడ్రా స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ జితేంద్ర అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌ సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలను వినిపిస్తూ ఎలాంటి నోటీసు ఇవ్వకుండా సర్వే నెం.105లోని రెండు ప్లాట్‌లను స్వాధీనం చేసుకుని కంచె వేయడంతోపాటు పబ్లిక్‌ బోర్డులను ఏర్పాటు చేసిందన్నారు.

కోర్టు శాశ్వత ఇంజక్షన్‌ ఉత్తర్వులున్నా, ఇదే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినా హైడ్రా పట్టించుకోకపోవడంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేస్తూ కోర్టు వివాదంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకునే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలంటూ రెవెన్యూ, పురపాలకశాఖలు అనుమతుతలిచ్చినట్లు ఏవైనా రికార్డులున్నాయా అంటూ ప్రశ్నించారు. కోర్టు వివాదాల్లోని వివాదాస్పద స్థలాలపై హైడ్రా దృష్టి సారించినట్లు నీటివనరులపై ఎందుకు దృష్టి సారించడంలేదన్నారు.

ఒకవేళ కోర్టు వివాదంలోని భూములను రక్షించాలనుకుంటే కోర్టు అనుమతి తీసుకోవాలన్నారు. అలా కాకుండా యాజమాన్య హక్కులను ఎలా నిర్ధారిస్తారని, అందులో ఉన్నవారిని ఖాళీ చేయించి ఎలా స్వాధీనం చేసుకుంటారని నిలదీశారు. న్యాయాధికార పరిధిని అతిక్రమించేలా హైడ్రా చర్యలున్నాయని, ఇలాంటివాటిని ఆమోదించలేమని వ్యాఖ్యానించారు. కోర్టు ఉత్తర్వులున్నా కంచె వేయడం, బోర్డు పెట్టడం కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనేనన్నారు. 48 గంటల్లో బోర్డును తొలగించాలని, తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా యథాతథస్థితిని కొనసాగించాలన్నారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జూన్‌ 10కి వాయిదా వేశారు