నేనే అవినీతిపరుడైతే ఈ ప్రపంచంలో నిజాయితీనే లేదు : కేజ్రీవాల్

నేనే అవినీతిపరుడైతే ఈ ప్రపంచంలో నిజాయితీనే లేదు : కేజ్రీవాల్

తాను అవినీతిపరుడైతే ఈ ప్రపంచంలో నిజాయితీపరుడు ఎవరూ ఉండరని  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.  ప్రధాని మోడీ, కేంద్రప్రభుత్వంపై  ఆయన మరోసారి ఫైరయ్యారు.  ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏప్రిల్ 14న సీబీఐ కేజ్రీవాల్ కు సమన్లు పంపింది. ఈ క్రమంలో  కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.  ఏప్రిల్ 16న  తాను సీబీఐ విచారణకు హాజరు అవుతానని చెప్పారు.  తనని అరెస్ట్ చేయమని సీబీఐని బీజేపీ ఆదేశిస్తే.. వారి సూచనలను సీబీఐ కచ్చితంగా పాటిస్తుందని ఢిల్లీ సీఎం ఆరోపించారు. 

ఢిల్లీ అసెంబ్లీలో అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడిన రోజు నుంచి  సీబీఐ, ఈడీకి సమన్లు ​పంపే వరుసలో తాను ఖచ్చితంగా ఉంటానని తనకు తెలుసునని అన్నారు.  లిక్కర్ స్కామ్ కేసులో   కేంద్ర ఏజెన్సీలు తమపై కోర్టులకు అబద్ధాలు చెబుతున్నాయని, అరెస్టు చేసిన వ్యక్తులను చిత్రహింసలకు గురిచేస్తున్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు.   

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏప్రిల్ 16న విచారణకు హాజరుకావాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ ఇప్పటికే  సమన్లు పంపింది. ఏప్రిల్ 16 ఆదివారం ఉదయం 11 గంటలకు  కేజ్రీవాల్ ను సీబీఐ విచారించనుంది. ఇప్పటికే ఈ కేసులో పలుమార్లు ప్రశ్నించి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ  ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది. ఇక  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవను  ఈడీ పలుమార్లు  విచారించింది.