రష్యాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి మృతదేహం వైట్ నది సమీపంలో డ్యామ్ దగ్గర దొరికింది. రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన 22 ఏళ్ల అజిత్ సింగ్ చౌదరి 2023లో MBBS కోర్సు కోసం బష్కిర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చేరాడు.
సమాచారం ప్రకారం, అజిత్ సింగ్ చౌదరి అక్టోబర్ 19న ఉదయం 11 గంటల సమయంలో పాలు కొనడానికి హాస్టల్ నుండి వెళ్లి కనిపించకుండా పోయాడు. చివరికి వైట్ నది దగ్గర ఉన్న డ్యామ్ లో చౌదరి మృతదేహం దొరికిందని అల్వార్ సరస్ డెయిరీ చైర్మన్ నితిన్ సంగ్వాన్ చెప్పారు.
ఇదిలా ఉండగా, చౌదరి మృతదేహాన్ని భారతదేశానికి తరలించడానికి సహాయం చేయాలని అఖిల భారత వైద్య విద్యార్థుల సంఘం, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మలకు లేఖ రాసింది.
అజిత్ సింగ్ చౌదరి అక్టోబర్ 19న హాస్టల్ నుండి అదృశ్యమయ్యాడు, ఆ తర్వాత అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. అతని జాకెట్, బూట్లు, ఫోన్ నది ఒడ్డున దొరికాయని అతని కుటుంబం చెప్పినట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 20న అజిత్ సింగ్ చౌదరి కుటుంబానికి రష్యన్ పోలీసుల నుండి ఫోన్ వచ్చిందని చెప్పారు. అయితే ఆ సమయంలో చౌదరికి ఎం జరిగిందో పూర్తిగా తెలియలేదని కుటుంబం ఆరోపించింది. తరువాత అజిత్ సింగ్ రూమ్‌మేట్ అజిత్ అదృశ్యం గురించి హాస్టల్ వార్డెన్‌కు సమాచారం ఇచ్చాడు, కానీ వార్డెన్ కూడా సరిగ్గా స్పందించలేదు. యూనివర్సిటీ అధికారులను సంప్రదించిన ఎటువంటి సమాధానం రాలేదు. అజిత్‌కు ఎం జరిగిందో మాకు తెలియదు అని కుటింబీకులు చెబుతున్నారు.
అయితే కుటుంబ సభ్యులు వార్డెన్‌తో మాట్లాడిన తర్వాత... చౌదరి నదిలోకి దూకి ఉండవచ్చని పోలీస్ అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది. అతను కనిపించకుండా పోవడానికి కేవలం గంట ముందు తన కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. అయితే అజిత్ సింగ్ చౌదరి నవంబర్‌లో ఇండియాకి తిరిగి రావాల్సి ఉంది.
