
- తెలంగాణలో తాలిబన్ల రాజ్యం సాగుతోంది
- మేం దీక్ష చేస్తేనే ప్రభుత్వంలో కదలిక వచ్చింది
- పోలీసులు మాపై అనుచితంగా వ్యవహరించారు
- తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా?
- రాష్ట్రాన్ని మద్యం మత్తులో ముంచెత్తుతున్నారు
- బడులెన్ని? వైన్సులెన్ని? కేసీఆర్ ఆలోచించుకోవాలి
- వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల
హైదరాబాద్: అసమర్థ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు చేయని న్యాయం.. ఆ దేవుడే చేశాడని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. సైదాబాద్ లో చిన్నారిని రేప్ చేసి చంపేసిన నిందితుడు రాజు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఉదంతాన్ని ఆమె ప్రస్తావిస్తూ దేవుడే న్యాయం చేశాడన్నారు. తెలంగాణలో తాలిబన్ల రాజ్యం సాగుతోందని.. న్యాయం చేయాలని మేం దీక్ష చేస్తేనే ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. లోటస్ పాండ్ లో గురువారం సాయంత్రం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు మాపై అనుచితంగా వ్యవహరించారని ఆరోపించారు. తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? లేదా? రాష్ట్రాన్ని మద్యం మత్తులో ముంచెత్తుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బడులెన్ని? వైన్సులెన్ని? కేసీఆర్ ఆలోచించుకోవాలి అని వైఎస్ షర్మిల సూచించారు.
మేం దీక్ష చేపట్టడంతోనే ప్రభుత్వంలో కదలిక
‘‘అట్టడుగు వర్గానికి, పేద కుటుంబానికి చెందిన ఆరేండ్ల చిన్నారిపై నిందితుడు రాజు అత్యాచారం చేసి, ఘోరంగా చంపాడు. వారం రోజులుగా పోలీసులు నిందితున్ని పట్టుకోలేదు. ఇటు ప్రభుత్వం కూడా స్పందించలేదు. ఏ ఒక్క ప్రభుత్వ పెద్ద కూడా రాలేదు. సీఎం నుంచి కార్పొరేటర్ స్థాయి వరకు ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. అందుకు నిరసనగా మేం బుధవారం నిరసన దీక్ష చేశాం. మేం దీక్ష చేసిన తర్వాతే ప్రభుత్వంలో చలనం వచ్చింది. పోలీసుల్లో కదలిక వచ్చింది. వారికి సోయి వచ్చింది. మేం దీక్ష చేపట్టిన తర్వాతనే ఆ రోజు సాయంత్రం హోంమంత్రి పోలీసులతో మాట్లాడారు. ఈ రోజు పొద్దున హోంమంత్రితో పాటు గిరిజన మంత్రి ఆ కుటుంబం వద్దకు వెళ్లి సాయం చేస్తామని చెప్పారు. మేం దీక్ష మొదలు పెట్టిన తర్వాతనే వారిలో కదలిక వచ్చి, ఈ కేసు ఇంత వరకు రాగలిగింది. శాంతియుతంగా దీక్ష చేస్తున్న మాపై దాదాపు 200 మంది పోలీసులు రంగంలోకి దిగి, బలంవంతంగా వాహనాల్లో లాక్కెళ్లి, హౌజ్ అరెస్ట్ చేశారు. మేం దీక్ష చేసినప్పుడు రాళ్లు లేవు.. కట్టెలు లేవు.. బాంబులు లేవు... మారణాయుధాలు అసలే లేవు.. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా దీక్ష చేస్తున్నాం. అర్ధరాత్రి దాటాక, జనాలు లేనప్పుడు దొంగల్లా వచ్చి మమ్మల్ని పోలీసులు లాక్కెళ్లారు..’’ అని వైఎస్ షర్మిల అన్నారు. శాంతియుతంగా నిరసన, దీక్ష చేసే హక్కు దేశ ప్రజలకు లేదా? ’’ అని ఆమె ప్రశ్నించారు.
తాలిబన్ల చేతిలో ఆఫ్ఘన్ బంది అయినట్లు కేసీఆర్ చేతిలో తెలంగాణ బందీ
‘‘తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా? శాంతియుతంగా చేస్తున్న దీక్షను పోలీసులు పనికట్టుకుని భగ్నం చేశారు. ఇది తాలిబన్లను తలపించే విధంగా ఉంది. తాలిబన్ల చేతిలో ఆఫ్ఘనిస్తాన్ బందీ అయినట్లు, కేసీఆర్ చేతిలో తెలంగాణ బందీ అయింది. తెలంగాణలో నియంత పాలన సాగుతోంది. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిని హౌజ్ అరెస్ట్ చేయడం, ఇంకొంత ఎక్కువ నిరసన తెలిపితే జైలులో పెట్టడం కేసీఆర్ కు అలవాటైంది. ఇదేనా కేసీఆర్ కు తెలిసిన న్యాయం? దీనిపై కేసీఆర్ సమాధానం చెప్పాలి. చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. అసమర్థ ప్రభుత్వం, పోలీసులు చేయని న్యాయం.. ఆ దేవుడు చేశాడు. ముమ్మాటికీ ఇది కేసీఆర్ వైఫల్యమే..’’ అన్నారు.
ఏం చేసినా చెల్లుతోందనే.. రెచ్చిపోతున్నారు
‘‘తెలంగాణ రాష్ట్రంలో ఇంతటి భయానకర హత్యాచారాలు జరుగుతుంటే నిందితుల్ని పట్టుకుని, కఠినంగా శిక్షించకపోవడంతోనే ఆడబిడ్డలు, మహిళలపై హత్యాచారాలు జరుగుతున్నాయి. దీనికి నిదర్శనమే ఈ రోజు జగిత్యాలలో ఐదేండ్ల బాలికపై జరిగిన దాడి మరియు హైదరాబాద్ లో తొమ్మిదేండ్ల అమ్మాయిపై జరిగిన అత్యాచారయత్నం. ఓ పక్క దీక్ష చేస్తున్నా.. మరోపక్క క్యాండిల్ ర్యాలీలు తీస్తున్నా.. ఇంకోపక్క ప్రజలు నిరసన తెలుపుతున్నా.. దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం ప్రభుత్వం పట్టింపులేనితనమే. పోలీసులు స్పందించకపోవడంతోనే ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ఉద్దేశంతోనే హంతకులు రెచ్చిపోతున్నారు. వీరికి కేసీఆర్, కేటీఆర్ పరోక్షంగా ధైర్యం కల్పించారు..’ అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
ఎక్కడకెళ్లినా గంజాయి, డ్రగ్స్ దొరకుతున్నాయి..ఆడోళ్లు బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి
భగత్ సింగ్ పిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే.. అలాంటి మహనీయున్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన యువత.. నేడు ఏ ఆశయం లేకుండా బతుకుతోంది. దీనికి కారణం మత్తు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి, డ్రగ్స్, మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది. దీనిని అరికట్టాల్సిన అవసరం కేసీఆర్ పైన ఉంది. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా గంజాయి, డ్రగ్స్ దొరుకుతున్నాయని మహిళలు చెబుతున్నారు. తమ పిల్లలు వీటిని బానిసవుతున్నారని ఏడుస్తున్నారు. ఆడ పిల్లలు, మహిళలు బయట అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. తమ పరిస్థితి దారుణంగా ఉందని రోదిస్తున్నారు. వీరందరికీ కేసీఆర్ ఏ సమాధానం చెబుతారు? అని వైఎస్ షర్మిల నిలదీశారు.
3200 స్కూళ్లు మూసేసి.. 14వేల టీచర్లను ఉద్యోగాల నుంచి తీసేశారు
‘‘ ఈ రోజు తెలంగాణలో 3,200 స్కూళ్లను మూసివేశారు. 14వేల టీచర్లను ఉద్యోగాల నుంచి తీసేసారు. ఫీజు రీయింబర్స్ మెంట్ లేదు.. జాబ్స్ లేవు.. యువతను మొత్తం మద్యం మత్తులో ముంచేస్తున్నారు కేసీఆర్ గారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 300శాతం మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. దీనికి కారణం మద్యం, మత్తు పదార్థాలేనని వైఎస్ షర్మిల ఆరోపించారు.
గల్లీకో బారు.. వీధికో వైన్ షాప్
తెలంగాణ రాష్ట్రంలో గల్లీకో బారు.. వీధికో వైన్ షాప్... ఎక్కడికి వెళ్లినా మద్యం ఏరులై పారుతోందని వైఎస్ షర్మిల ఆరోపించారు. ‘‘తెలంగాణలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? ఎన్ని బార్ షాపులు ఉన్నాయి? ఎన్ని గుడులు ఉన్నాయి? ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి? కేసీఆర్ ఆలోచించుకోవాలి. తెలంగాణలో మద్యం ఆదాయం 2014-–15లో రూ. 10.88 వేల కోట్లు ఉంటే.. 2020–-21 నాటికి రూ.27.28 వేల కోట్లు పెరిగింది. అంటే 300శాతం ఎక్కువ పెరిగింది. మహిళలపైనా 300శాతం అత్యాచారాలు పెరిగిపోయాయి? దీనికి దానికి సంబంధం లేదంటారా? యువత మద్యం, గంజాయికి అలవాటు పడి, ఏం తెలియని చిన్న పిల్లలను టార్గెట్ చేస్తున్నారు..’’ అని వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణను కేసీఆర్ నీచ స్థాయికి దిగజార్చారు
తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఏడేళ్లలో నీచ స్థాయికి దిగజార్చారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇకనైనా ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ మన రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో ప్రజలు ఆలోచించాలి, ఇది బంగారు తెలంగాణనా? బర్ బాత్ అవుతున్న తెలంగాణనా? ప్రజలు ఆలోచన చేయాలి, ఇలాంటి అరాచకాలను అరికట్టాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు. దేవుడే శిక్ష వేస్తుంటే మరి ముఖ్యమంత్రి ఎందుకు ఉన్నట్టు? మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం ఎందుకు ఉన్నట్టు? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.