పాతికేండ్ల వయసులో ఉన్నవాడికి పరువం పరుగులు తీస్తుంది. హృదయం పరవళ్ళు తొక్కుతుంది. అతడే కవియైతే ప్రణయగీతాలు పాడుతాడు. కల్యాణం శ్రీనివాస్ చేసింది అదే. అతని ఎదలోంచి పెల్లుబికిన గేయాలే “హృదయం ” కవితా సంపుటి.
“ఏమని వర్ణింతు నీ ప్రకృతి అందం / ఎదలో పొంగే భావ తరంగం / నీలాల మేఘాల తరలే తెరలు / నింగికి పోటీగ నల్లని గిరులు / పచ్చని బంగారమై మెరిసే తరులు / పసిడి నవ్వుల్లా విరిసిన విరులు” అని పరవశిస్తాడు కల్యాణం శ్రీనివాస్.
ఈ కవికి ప్రకృతి అంటే ఇష్టం. ఇతని దృష్టిలో జాబిలి - పండు వెన్నెల వన్నెల రాణి. పుడమి - సహన సుందరమూర్తి. నదుల నడకలు, లయల నొలికేవి. నింగి ఇలకే వింతగ నీడగ నిలిచేది. ప్రకృతిలో ఎటు చూసినా పారవశ్యమే. “కొమ్మ మీద పూలరెమ్మ / పసిడి నవ్వులు నవ్వవట్టె / పూవు పక్కని లేత మొగ్గ / సిగ్గు మొగ్గలు వేయవట్టె”, “పైరగాలులు అల్లనల్లన - ఈల పాటలు ఊదసాగె - ప్రకృతంత పరవశించి - పల్లవేదో పాడసాగె”.
ఈ కవికి జాబిలి అంటే మరీ ఇష్టం. ఒక్కనాడు జాబిలమ్మ కనిపించకున్నా జాగారమే. “నిను చూడక నేనెన్నడు కునుకైనా తీశానా?” అని అడుగుతాడు. చుక్కల చెలికత్తెలతో / చక్కగ ఆటలు ఆడేదానివి... ఎక్కడ పోతివే జాబిల్లి / ఎదలో మెదిలే నవమల్లి | ఎంతకు రావేమే మళ్ళీ” అని పిలుస్తాడు. “చందమామతో సరసమాడాలి - చక్కనమ్మతో ముద్దులాడాలి - చుక్కలన్ని సిగ్గుతో కళ్లు మూసుకోవాలి” అని కలలుగన్నాడు. చుక్కల నడుమ చల్లని వెన్నెల కురిసే చక్కని చుక్కవు నీవు - నలుదిక్కులకూ నవ్వులు పంచే - పండు వెన్నెల రాణివి నీవు” అని ప్రశంసించాడు. ఈ కవితల నిండా జాబిలి వెన్నెల పరిచింది.
ఈ కావ్యంలోని “తేలిపోయే చిరుగాలి - సడి సేయకే ఈ రేయి” అనే పాటపై కృష్ణశాస్త్రి, “వేణువయి వచ్చాను భువనానికి - వెన్నెలయి పోతాను గగనానికి” అనే పాట పల్లవిపై వేటూరి, “పల్లె పిలిచింది” కవితపై గురజాడ, “ఆమనికి ఆహ్వానం” కవితపై - ఎంకిపాటల ప్రభావం ఉన్నా, శ్రీనివాస్ తనదైన ముద్రతో కవితలల్లాడు. పాటల రచయితలను అధ్యయనం చేశాడు కనుకనే మంచి పదాలు, భావాలు, శైలి పట్టుబడ్డాయి. రేడియో సింగర్ అనుపమ పాడిన ఇందులోని కొన్ని గేయాలు రేడియోలో ప్రసారం కావడం ప్రశంసనీయం. ఈ కావ్యంలో ఒక్కొక్క పాటది ఒక్కొక్క శైలి. అమృత పాట, పూర్ణజాబిలి వంటి మిశ్ర సమాసాలు రాకుండా చూసుకోవాలి. శ్రీనివాస్ ఇంకా దృష్టి సారిస్తే అనేక పాటల సృష్టి చేయగలడు. ప్రయత్నిస్తే సినిమా పాటలూ రాయగలడు. అంతేకాదు. ఇతడు చిత్రకారుడు, కార్టూనిస్ట్. తన పుస్తకానికి ముఖచిత్రం తానే వేసి, లోపలి కవితలకు బొమ్మలు తానే గీసి, తన 'హృదయం'ను పాఠకుల ముందుంచిన కల్యాణం శ్రీనివాస్‌కు అభినందనలు.
ఎ. గజేందర్ రెడ్డి, 9848894086
