కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లాలో ప్రమాదాల నివారణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని, ఇందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఆర్‌అండ్‌బీ, పోలీస్, ట్రాన్స్‌పోర్ట్, ఆర్టీసీ, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో రోడ్డు భద్రత కమిటీ, జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గత రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలని అన్నారు. సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ కరీంనగర్– జగిత్యాల రోడ్డుకు ఇరువైపులా ఆరు ఫీట్ల మేర చదును చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పురుషోత్తం, ఆర్టీసీ డీఎం సునంద, ఏసీపీ వెంకటస్వామి, అధికారులు పాల్గొన్నారు.
