ఈడీ టు సీబీఐ.. మరోసారి కవిత అరెస్టు

ఈడీ టు సీబీఐ.. మరోసారి కవిత అరెస్టు
  • తీహార్ జైల్లో అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు 
  • ఇయ్యాల కోర్టులో హాజరు.. అరెస్టుపై భర్త అనిల్​కు సమాచారం
  • ట్రయల్ కోర్టులో కవిత లాయర్ పిటిషన్.. నేడు విచారణ 

న్యూఢిల్లీ, వెలుగు:  లిక్కర్ స్కామ్​ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్టు చేసింది. ఈ స్కామ్ లో మనీలాండరింగ్ కేసు కింద కవితను ఈడీ ఇప్పటికే అరెస్టు చేయగా, ఆమె ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైల్లో ఉన్నారు. అయితే కేసు దర్యాప్తులో తమకు సహకరించడం లేదని, అందుకే కవితను అదుపులోకి తీసుకున్నామని సీబీఐ గురువారం వెల్లడించింది. ఈ మేరకు కవిత భర్త అనిల్ కు సమాచారం ఇచ్చింది. ఐపీసీ 477, 120(B), పీసీ యాక్ట్ 7 సెక్షన్ల కింద కవితను అరెస్టు చేసినట్టు తెలిసింది. ఆమెను శుక్రవారం ఉదయం 10:30 గంటలకు జైలు నుంచి నేరుగా ట్రయల్ కోర్టుకు తీసుకెళ్లి హాజరుపరచనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా కవితను తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరనున్నట్టు తెలిసింది. 

కాగా, తీహార్ జైల్లో ఉన్న కవితను విచారించేందుకు ట్రయల్ కోర్టు అనుమతి తీసుకున్న సీబీఐ.. ఈ నెల 6న ఆమెను దాదాపు 3 గంటల పాటు విచారించింది. అయితే కవిత విచారణకు సహకరించడం లేదని, ఆమెను అరెస్టు చేసేందుకు అనుమతివ్వాలని బుధవారమే కోర్టులో సీబీఐ అప్లికేషన్ దాఖలు చేసినట్టు తెలిసింది. కోర్టు అనుమతించడంతో గురువారం ఉదయం కవితను అదుపులోకి తీసుకుంది. 

ట్రయల్ కోర్టుకు కవిత.. 

సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఆమె తరఫున లాయర్ మోహిత్ రావు గురువారం ఢిల్లీ రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే రంజాన్ సందర్భంగా సెలవు దినం కావడంతో ఈ పిటిషన్ పై ఎమర్జెన్సీ బెంచ్ విచారణ చేపట్టింది. దాదాపు అరగంట పాటు వాదనలు సాగాయి. కవిత తరఫున లాయర్ నితేశ్ రాణా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, మోహిత్ రావు నేరుగా వాదనలు వినిపించారు. నిబంధనలకు విరుద్ధంగా కవితను సీబీఐ అరెస్టు చేసిందని అన్నారు. ఆమె అరెస్టుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని కోరారు. అయితే ఈ కేసులో తాను ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేనని స్పెషల్ జడ్జి మనోజ్ కుమార్ స్పష్టం చేశారు. ‘‘ఈ కేసు గురించి నాకెలాంటి వివరాలు తెలియవు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎలాంటి ఆర్డర్లు పాస్ చేయలేదు. సెలవు రోజు కావడంతో కేవలం ఎమర్జెన్సీ కేసులను మాత్రమే విచారించగలను. మోహిత్ రావు కోరడంతో కవిత పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్నాను” అని స్పెషల్​ జడ్జి తెలిపారు. ఈ పిటిషన్​పై శుక్రవారం ఉదయం 10 గంటలకు విచారణ చేపట్టాలని రెగ్యులర్ బెంచ్ స్పెష ల్ జడ్జి కావేరి బవేజాకు సూచించారు. 

కవిత అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధం: మోహిత్ రావు

కవిత అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధమని ఆమె తరఫు లాయర్ మోహిత్ రావు అన్నారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కోర్టులో వాదనల తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఎవరినైనా జైలు నుంచి అరెస్ట్ చేయాలంటే కోర్టు పర్మిషన్ ఉండాలి. మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కోర్టు అనుమతులివ్వడం ఇది రెండోసారి. ఈ నెల 5న కవితను జైల్లో విచారించేందుకు, ఇప్పుడు అరెస్ట్ చేసేందుకు కోర్టు అనుమతిచ్చింది. అసలు ఏం జరుగుతుందో తెలియకుండా పూర్తిగా చీకట్లో పెట్టి ఆమెను అరెస్ట్ చేశారు. చట్ట పక్రారం ప్రతివాదులైన మాకు నోటీసు ఇవ్వాల్సి ఉంది. కవిత అరెస్టుపై ఆమె భర్తకు సమాచారం ఇచ్చినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. కవిత అరెస్టుపై న్యాయపోరాటం చేస్తాం” అని అన్నారు. 

రెండుసార్లు విచారణ.. 

ఈ కేసులో కవితను సీబీఐ రెండుసార్లు విచారించింది. 2022 డిసెంబర్ లో తొలిసారి కవితకు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లో గానీ, సీబీఐ కార్యాలయంలో గానీ విచారణకు హాజరుకావాలని కోరింది. అయితే డిసెంబర్ 11న హైదరాబాద్ లోని తన నివాసంలో విచారణకు సిద్ధమని కవిత రిప్లై ఇచ్చారు. దీంతో అదే రోజు దాదాపు 7 గంటలకు పైగా కవితను విచారించిన సీబీఐ.. ఆమె స్టేట్ మెంట్ రికార్డు చేసింది. అనంతరం కవితను నిందితురాలిగా చేర్చుతూ ట్రయల్ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసిన సీబీఐ.. మళ్లీ ఈ ఏడాది ఫిబ్రవరి 21న ఆమెకు మరోసారి నోటీసులు ఇచ్చింది. అయితే ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ సాకుతో విచారణకు కవిత హాజరుకాలేదు. కాగా, కోర్టు అనుమతితో ఈ నెల 6న తీహార్ జైల్లో కవితను రెండోసారి సీబీఐ అధికారులు విచారించారు.