- ఎమ్మెల్యే ఆరోపణలపై ఆధారాలతో మీడియా ముందుకొస్తా: జాగృతి అధ్యక్షురాలు కవిత
పద్మారావునగర్, వెలుగు: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం ఆయన ఫ్రస్ట్రేషన్‌ను బయట పెడుతున్నదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. నిజాలు చెప్తే ఆయన తనను పర్సనల్‌గా టార్గెట్‌చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే చేసిన అన్ని ఆరోపణలపై ఆధారాలతో సహా త్వరలో మీడియా ముందుకు వస్తానని తెలిపారు. జాగృతి జనం బాటలో భాగంగా హైదరాబాద్జిల్లాలో మొదటి రోజైన బుధవారం ఆమె సనత్‌నగర్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మాధవరం మాటలకు ఫీలయ్యేది లేదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. కూకట్ పల్లిలో 15 ఏండ్లుగా ఉన్న సమస్యలనే తాను చెప్పానని కవిత స్పష్టం చేశారు. జాగృతి జనం గళమై పనిచేస్తోందన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా ఐదు రోజుల పాటు హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తానని కవిత తెలిపారు. విద్య, వైద్యం మీద ఫోకస్ పెట్టామని తెలిపారు. ఇండ్లు, ఇండ్ల పట్టాలు లేని వారి సమస్యలు కూడా తెలుసుకుంటున్నామని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. టాప్ టెన్ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇస్తామని కవిత ప్రకటించారు.
నన్ను నిజామాబాద్‌కే పరిమితం చేసిన్రు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తనను నిజామాబాద్వరకే పరిమితం చేశారని.. దాంతో అప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తెలంగాణ వచ్చాక ఏం జరిగింది? ఏం జరగలేదన్నది ప్రస్తుతం జనం బాట కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. ఈ సందర్బంగా కంటోన్మెంట్ నియోజకవర్గం రసూల్‌పుర, అన్నానగర్బస్తీ వాసుసులతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత బోయిన్‌పల్లిలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, రామన్న చెరువును పరిశీలించారు. మనోవికాస నగర్ లోని ఎన్ఐఈపీసీ హాస్పిటల్ ను సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సనత్ నగర్ లోని దాసరిబస్తీని సందర్శించి, స్థానికులతో మమేకమై, సమస్యలపై ఆరా తీశారు. యూసుఫ్ గూడకు చెందిన మైనర్ బాలుడు అజిత్ రీల్స్ తీస్తుంటే జూబ్లీహిల్స్ పోలీసులు అతన్ని మూడు రోజులు పాటు చిత్రహింసలు చేయడంపై తాను డీజీపీని కలుస్తానని కవిత అన్నారు. ఈ ఘటనపై హ్యూమన్ రైట్స్ కమిషన్ సీరియస్ గా తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

