అవినీతిపరులను వదిలే ప్రసక్తి లేదు: కిషన్​ రెడ్డి

అవినీతిపరులను వదిలే ప్రసక్తి లేదు: కిషన్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కవిత అరెస్టుకు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ స్టేట్​ చీఫ్​, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి అ న్నారు. తప్పుచేస్తే ఎంతవారికైనా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చర్యలు తప్పవని, అవినీతిపరులను వదిలే ప్రసక్తి లేదని ఆయన పేర్కొన్నారు. చివరికి బీజేపీ కార్యకర్తలు తప్పుచేసినా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. లిక్కర్ కుంభకోణానికి పాల్పడిన కవితకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేయడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ బీజేపీలో చేరారు. ఆయనకు కిషన్​రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మోదీ పాలనపై ఆదరణ పెరుగుతున్నదని అన్నారు. లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 సీట్లు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో కలిసి 400కు పైగా సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు.  

కల్వకుంట్ల పాలన బాటలోనే కాంగ్రెస్​

రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్​ పని అయిపోయిందని.. పదేండ్లలో అవినీతి, అక్రమాలకు పాల్పడిందని కిషన్​రెడ్డి మండిపడ్డారు. నిరంకుశ, నియంతృత్వ పాలనతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన కల్వకుంట్ల కుటుంబ రాజకీయాలను ప్రజలు ద్వేషించారని అన్నారు. కేసీఆర్ కూతురు కవితను మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు అరెస్టు  చేశారని.. ఈడీ దర్యాప్తులో లభించిన ఆధారాలు, కవితతో కలిసి పనిచేస్తున్నవాళ్లు ఇచ్చిన వాంగ్మూలాల కారణంగానే కోర్టులో ఆమెను హాజరు పరిచారని పేర్కొన్నారు. తప్పుచేశామని కోర్టు బోనులో ఒప్పుకుని, న్యాయపరమైన చర్యలకు సహకరించాల్సింది పోయి.. ఏదో సాధించినట్లు బీఆర్​ఎస్​ నేతలు మాట్లాడటాన్ని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. మునుగోడు బై పోల్​ టైమ్​లో తాను పర్యటిస్తున్నప్పుడు ఒక ఊర్లో 16 బెల్టు షాపులను చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. 

ఎస్సీ వర్గీకరణకు కేంద్రం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది: ఆరూరి

బీజేపీలో చేరిన బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ మాట్లాడుతూ.. దేశ ప్రజల ప్రయోజనాలు, అభివృద్ధే పరమావధిగా పనిచేస్తున్న మోదీ నాయకత్వానికి ఆకర్శితుడనై బీజేపీలో చేరుతున్నట్లు చెప్పా రు. ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, అం దుకే తాను బీజేపీలో చేరానని అన్నారు. పదేండ్లలో ఒక్క అవినీతి మరకలేకుండా మోదీ పాలన సాగిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, మాజీ మంత్రి విజయ రామారావు, నాయకులు ధర్మారావు, కొండేటి శ్రీధర్, జైపాల్, పొన్నాల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. 

అవినీతి రహిత పాలన అందించాం

యూపీఏ పదేండ్ల పాలనలో రూ.12 లక్షల కోట్ల స్కామ్స్ జరిగాయని, మోదీ పాలనలో ఒక్క కుంభకోణం కూడా లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అవినీతి రహిత పాలన అందించిన గొప్ప వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని తెలిపారు. హైదరాబాద్​లో బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో అడ్వకేట్స్ మీట్ కార్యక్రమం జరిగింది. ఈ ప్రోగ్రామ్​కు చీఫ్ గెస్ట్​లుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. కర్నాటకలో చిన్న పొరపాటుతో అధికారం చేపట్టలేకపోయామన్నారు. తమిళనాడులోనూ బీజేపీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నదని తెలిపారు. తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ వైపే ఉన్నారన్నారు. ‘‘రాష్ట్రంలో జరిగిన ప్రతి అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంది. రైతుల కోసం సబ్సిడీలు అందించాం. టెర్రరిజాన్ని అంతం చేశాం. శాంతియుత వాతావరణంలో దేశ పాలన సాగుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులైనా.. ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదు. రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలి. నిరుద్యోగ భృతి ఊసెత్తడం లేదు’’అని విమర్శించారు. 

కాంగ్రెస్ హామీలు అమల్లో సాధ్యం కావు

ప్రజల మనోగతానికి అనుగుణంగా మేనిఫెస్టో తయారు చేయడానికి బీజేపీ సిద్ధమైందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. అందులో భాగంగానే ప్రజలు, మేధావులు, బీసీల సలహాలు తీసుకోవడానికి ముందుకొచ్చినట్టు వివరించారు. తమది కేవలం బీజేపీ మేనిఫెస్టోలా కాకుండా.. ప్రజల మేనిఫెస్టోలా ఉండాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్రంలో అమల్లో సాధ్యం కాని హామీలు కాంగ్రెస్ ఇచ్చిందన్నారు.