కాళేశ్వరంపై మాటల యుద్ధం! రాజ్యసభలో కేఆర్ సురేశ్ రెడ్డి వర్సెస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కాళేశ్వరంపై  మాటల యుద్ధం! రాజ్యసభలో కేఆర్ సురేశ్ రెడ్డి వర్సెస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • కాళేశ్వరం ప్రాజెక్టును, కేసీఆర్​ను ఆకాశానికెత్తిన సురేశ్​రెడ్డి
  • కేంద్రం సహకరించకపోయినా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టును కట్టామని వెల్లడి
  • అదంతా జనం సొమ్ము కాదా.. 
  • కేసీఆర్ దుబాయ్ నుంచి డబ్బులేమైనా తెచ్చారా అని కేంద్రమంత్రి కౌంటర్
  • కాళేశ్వరం కుంగిపోయిందని, దాంతో ఎలాంటి ఉపయోగం లేదన్న కిషన్​రెడ్డి​
  • స్వయంగా ఎన్​డీఎస్ఏ, కాగ్ ఈ విషయం చెప్పాయని వెల్లడి
  • కేసీఆర్​ను రేవంత్ ఎందుకు జైల్లో పెట్టడం లేదని నిలదీత

హైదరాబాద్, వెలుగు: రాజ్యసభ వేదికగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్​సురేశ్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్​రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఏపీ రాజధాని అమరావతిపై రాజ్యసభలో గురువారం చర్చ సందర్భంగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమని, కేంద్రం సహకరించకపోయినా, పైసా ఇవ్వకపోయినా సీఎం కేసీఆర్ గొప్పగా నిర్మించారంటూ కేఆర్ సురేశ్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. లక్ష కోట్లు గంగలో కొట్టుకుపోయాయని కేంద్ర జలశక్తి మంత్రి ఎలా అంటారని ప్రశ్నించారు. 

దీంతో కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి జోక్యం చేసుకుని ఆయనకు గట్టి కౌంటర్​ ఇచ్చారు. కేసీఆర్ ​ఏమైనా దుబాయ్​ నుంచి డబ్బులు తెచ్చి కాళేశ్వరం నిర్మించారా? అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రజల సొమ్ముతో కట్టారని, కేసీఆర్​ సొంత పైసలతో కాదన్నారు. కేంద్ర ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తెచ్చి వీళ్లు నిర్మించిన కాళేశ్వరం కూలిపోయిందన్నారు. దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని స్వయంగా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ, కాగ్ రిపోర్ట్ తేల్చాయన్నారు.


కేంద్రం నుంచి పైసా సాయం అందకపోయినా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని కేసీఆర్ నిర్మించారని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిన పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందని తెలిపారు. 12 ఏండ్లుగా తెలంగాణకు కేంద్రం ఎలాంటి సాయం చేయకున్నా రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదన్నారు. ‘‘సభలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి పైసా కూడా ఇవ్వలేదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్​ చెప్పారు.. రాష్ట్ర ప్రభుత్వమే రూ.34 వేల కోట్లు పెట్టి ప్రాజెక్ట్​ నిర్మిం చింది..  ఒక్క పైసా కూడా కేంద్రం నుంచి తీసుకోలేదు.. ఆ ప్రాజెక్ట్​ గురించి కేంద్రానికి కనీస అవగాహన లేదు.. అలాంటప్పుడు కేంద్ర మంత్రి గుడ్డిగా లక్ష కోట్లు గంగలో కొట్టుకుపోయాయని ఎలా అంటారు? కేంద్ర మంత్రి తప్పుడు ప్రకటన చేసి సభను తప్పుదోవ పట్టించారు.. సభా గౌరవాన్ని తగ్గించారు.. కాళేశ్వరం అంటే ఒక్క ప్రాజెక్ట్ కాదు.. మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 15 వేల పైప్​లైన్లు, 25 టన్నెళ్లు, ఎన్నో సబ్​స్టేషన్లు కలిపితేనే కాళేశ్వరం ప్రాజెక్ట్​.. అందులో ఒక్క బ్యారేజీకి మాత్రమే నష్టం జరిగింది.. అందులోని రెండు పిల్లర్లు కుంగాయంతే! దానికి రూ.300 కోట్లు పెడితే రిపేర్ అవుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతో అదిప్పటికీ నిరుపయోగంగానే మిగిలింది’’ అని ఆయన అన్నారు.

  • కాళేశ్వరంతో ఉపయోగం లేదని కాగ్ తేల్చింది: కిషన్​ రెడ్డి

రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలంలోని ఏడు మండలాలను ఏపీకి నాటి కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చేసిందని, విభజన బిల్లులోనే ఆ అంశాన్ని పెట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అప్పుడు కేసీఆర్.. సోనియా గాంధీ ఇంటికెళ్లి భోజనాలు చేసి, ఆమె కాళ్లు పట్టుకున్నారని గుర్తు చేశారు. బిల్లులో ఉన్న అంశంపై అప్పుడు ఎందుకు అడగలేదని, ఇప్పుడెందుకు అడుగుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​లోని మేడిగడ్డ బ్యారేజీ పూర్తిగా కుంగిపోయిందని తేల్చి చెప్పారు. 

‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్​తో ఎలాంటి లాభం లేదని కాగ్ రిపోర్ట్ తేల్చింది. డ్యామ్ సేఫ్టీ కమిటీ కూడా బ్యారేజీలకు తీవ్ర నష్టం జరిగిందని స్పష్టం చేసింది. ఒక్క పైసా కూడా కేంద్రం నుంచి తేలేదని ఇప్పుడంటున్నారు. పైసలు ఎక్కడి నుంచి తెచ్చారు? దుబాయ్ నుంచి ఏమైనా ముద్రించి తీసుకొచ్చారా? కేసీఆర్ జేబు నుంచి పెట్టి కట్టారా? అది ప్రజాధనం. ఎవరి ఇంటి నుంచో తెచ్చి కట్టిన ప్రాజెక్ట్ కాదు. ఆ డబ్బులు కేసీఆర్ ఇంటి నుంచిగానీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి గానీ తీసుకురాలేదు. 

అవన్నీ ప్రజల డబ్బులే. కేంద్ర ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తెచ్చి కట్టిన్రు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్​ కుటుంబానికి ఏటీఎంలా మారింది. కేసీఆర్​ను జైలులో పెడతామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్​ చెప్పింది. అధికారంలోకి వచ్చి రెండేండ్లవుతున్నా ఇప్పటికీ కేసీఆర్​పై ఎందుకు విచారణ జరిపించట్లేదు? సీఎం రేవంత్ పదే పదే అదే విషయం చెప్పారు. మరి, ఇప్పుడెందుకు కేసీఆర్​ను జైలులో పెట్టట్లేదు? ఆ రెండు పార్టీలూ ఒక్కటే. అవి రెండూ కుమ్మక్కయ్యాయి’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.