దేశ రాజధాని ఢిల్లీ వేదికగా విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. నీట్ (NEET) పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా, విద్యా వ్యవస్థలో జవాబుదారీతనంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. రాత్రికి రాత్రే రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ వంటి 16 మెట్రో స్టేషన్లను నిలిపివేసేంతగా ఈ ఉద్యమ సెగ రాజధానిని ఊపేస్తోంది
విద్యార్థులకు బాలీవుడ్ మద్దతు..
అయితే ఈ విద్యార్థుల నిరసనకు ఇప్పుడు బాలీవుడ్ స్టార్లు మద్దతు ప్రకటించడం మరింత దేశ వ్యాప్తంగా మరింత చర్చనీయాంశంగా మారింది. లేటెస్ట్ గా విద్యార్థుల పోరాటానికి సల్మాన్ ఖాన్ మద్దతు ప్రకటించారు. అటు స్టార్ హీరోయిన్ ఆలియా భట్ చేసిన భావోద్వేగ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆలియా భట్ ఎమోషనల్..
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆలియా భట్ పంచుకున్న సందేశంలో.. 'గత కొన్ని రోజులుగా జరిగుతున్న పరిణామాలతో నా హృదయం ముక్కలైంది.. అదే సమయంలో విద్యార్థులు చూపిస్తున్న ధైర్యం మళ్లీ ఆశను కలిగించింది' అని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి వెనుక ఓ కుటుంబం కలలు, ఎన్నో త్యాగాలు, భవిష్యత్తుపై ఆశలు దాగి ఉంటాయని ఆమె భావోద్వేగంతో నోట్ రాశారు. దేశ భవిష్యత్తును నిర్మించబోయే యువత గొంతును వినాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పేర్కొంటూ.. చివర్లో 'జై హింద్.. విద్యార్థుల కోసం.. విద్యార్థుల చేత' అంటూ తన సందేశాన్ని ముగించారు.
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా?
మరో వైపు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా విద్యార్థులకు అండగా నిలిచారు. విద్యా వ్యవస్థ మెరుగుపడాలనే లక్ష్యంతో యువత చేస్తున్న పోరాటాన్ని అభినందించిన ఆయన.. ప్రశాంతంగా సాగిన ఉద్యమం హింసాత్మకంగా మారడం బాధ కలిగించిందన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి ఘటనలు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయని, వాటిపై కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. ఈ ఉద్యమాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని, ఇది పూర్తిగా విద్యార్థులు,విద్యా వ్యవస్థ మధ్య ఉన్న అంశమని సల్మాన్ స్పష్టం చేశారు. భారతదేశం ప్రపంచానికి విద్యా కేంద్రంగా మారాలంటే నిజాయితీ, పారదర్శకతతో కూడిన విద్యా వ్యవస్థ అవసరమని ఆయన పేర్కొన్నారు.
►ALSO READ | రూ. 4 లక్షల పెట్టుబడి.. రూ. 450 కోట్ల లాభం.. జాక్ పాక్ కొట్టిన'జంపింగ్ జాక్' !
మెట్రో స్టేషన్లను మూసివేత
ఇక విద్యార్థుల ఉద్యమానికి ఇమ్రాన్ ఖాన్, జీనత్ అమన్, అనురాగ్ కశ్యప్, నసీరుద్దీన్ షా, రత్నా పాఠక్ షా, అభయ్ డియోల్, శబానా ఆజ్మీ, ప్రకాశ్ రాజ్ తదితర సినీ ప్రముఖులు కూడా సంఘీభావం ప్రకటించారు. మరోవైపు భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలోని పలు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేయడం పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఒక పేపర్ లీక్ పై ఉద్యమంగా మొదలైన ఈ పోరాటం... ఇప్పుడు సామాన్యులతో పాటు, రాజకీయ, బాలీవుడ్ సెలబ్రిటీల మద్దతుతో విద్యార్థుల ఉద్యమం దేశవ్యాప్తంగా మరింత చర్చనీయాంశంగా మారింది.
