OTT Thriller Review: చూడటం స్టార్ట్ చేస్తే వదలరు.. ఓటీటీలో ఉత్కంఠరేపుతున్న క్రైమ్ థ్రిల్లర్

OTT Thriller Review: చూడటం స్టార్ట్ చేస్తే వదలరు.. ఓటీటీలో ఉత్కంఠరేపుతున్న క్రైమ్ థ్రిల్లర్

కేరళ–తమిళనాడు సరిహద్దు నేపథ్యంలో వడ్డీ మాఫియా, కబడ్డీ మరియు ప్రతీకారం చుట్టూ తిరిగే పవర్-ప్యాక్డ్ డ్రామా ‘బాల్టీ’ (BALTI). ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (SonyLIV)లో ఈ మూవీ దూసుకెళ్తోంది. ఉన్ని శివలింగం ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో పాటుగా షేన్ నిగమ్, సెల్వ రాఘవన్, పూర్ణిమ ఇంద్రజిత్ పవర్ ప్యాకెడ్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఈ మలయాళ థ్రిల్లర్ తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది.

కథేంటంటే:

కేరళ– తమిళనాడు సరిహద్దులోని ఓ చిన్న పట్టణంలో ఉదయ్ (షేన్ నిగమ్) తన తల్లితో కలిసి జీవిస్తూ ఉంటాడు. తనతోపాటు ఉన్న ఫ్రెండ్స్ రమేశ్, మణి, కుమార్ కబడ్డీలో అద్భుతంగా రాణిస్తుంటారు. అదే ప్రాంతంలో భైరవ (సెల్వ రాఘవన్) వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. ఎక్సెల్ వడ్డీ, లార్జ్ వడ్డీ, జంబో వడ్డీ పేర్లతో అమాయకులను దోచుకుంటూ ఉంటాడు. మరోవైపు అదే పట్టణంలో సోడా ఫ్యాక్టరీ నడిపే సోడాబాబు (అల్ఫోన్స్) కాలేజీ విద్యార్థులకు మాత్రమే అప్పులు ఇస్తుంటాడు. తన తండ్రి పెరుమాళ్లును హత్య చేసిన భైరవపై ప్రతీకారం తీర్చుకోవాలని అతను సరైన అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. ఇక జీమా (పూర్ణిమ ఇంద్రజిత్) కూడా మహిళలకు మాత్రమే అప్పులు ఇచ్చే వడ్డీ వ్యాపారి. భైరవతోనూ, సోడాబాబుతోనూ ఆమెకు నిత్యం విభేదాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కబడ్డీ ఆటగాళ్లైన ఉదయ్, అతని ముగ్గురు స్నేహితులను భైరవ తన దగ్గరకు చేర్చుకుంటాడు. ఆ తర్వాత నలుగురి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

వడ్డీ మాఫియా, కబడ్డీ, ప్రతీకారం వంటి మూడు బలమైన అంశాలను ఒకే కథలో మేళవిస్తూ తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ‘బాల్టీ’. దర్శకుడు ఉన్ని శివలింగం కథను కేరళ–తమిళనాడు సరిహద్దు నేపథ్యంలో నడిపించడం వల్ల సినిమాకు మంచి రియలిస్టిక్ ఫీల్ వచ్చింది. ఫస్టాఫ్ లో పాత్రల పరిచయం, వడ్డీ వ్యాపారం చుట్టూ జరిగే సంఘటనలు నెమ్మదిగా సాగినా, ఇంటర్వెల్‌కు ముందు నుంచి కథ వేగం అందుకుంటుంది. సెకండాఫ్ లో వచ్చే ట్విస్టులు, ఎమోషన్స్, ప్రతీకారానికి సంబంధించిన ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఆసక్తిగా కథలోకి తీసుకెళ్తాయి.

షేన్ నిగమ్ మరోసారి తన సహజమైన నటనతో ఆకట్టుకుంటాడు. ఉదయ్ పాత్రలో అతని ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాల్లో చూపిన ఎనర్జీ సినిమాకు ప్రధాన ఆకర్షణ. భైరవ పాత్రలో సెల్వ రాఘవన్ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తూ విలన్‌గా మంచి ఇంపాక్ట్ చూపించాడు. పూర్ణిమ ఇంద్రజిత్ తన పాత్రకు తగ్గట్టుగా హుందాగా నటించగా, సోడాబాబు పాత్రలో అల్ఫోన్స్ కూడా మంచి నటన కనబరిచాడు. 

కబడ్డీ మ్యాచ్‌లను కథతో అనుసంధానం చేసిన విధానం బాగుంది. యాక్షన్ సన్నివేశాలు సహజంగా ఉండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా చోట్ల సన్నివేశాల ప్రభావాన్ని పెంచింది. సినిమాటోగ్రఫీ సరిహద్దు ప్రాంతాల వాతావరణాన్ని చక్కగా చూపించింది. మొత్తంగా , ‘బాల్టీ’ కమర్షియల్ అంశాలతో పాటు బలమైన కథ, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లే, మంచి నటనలతో ఆకట్టుకునే క్రైమ్ థ్రిల్లర్. సస్పెన్స్, యాక్షన్, ఎమోషనల్ డ్రామా ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి ఓటీటీ ఛాయిస్‌గా చెప్పొచ్చు.