చెన్నై: ప్రధాని మోడీ ఇంటి ముందు ధర్నా చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు బలవంతంగా నిర్భంధించడాన్ని టీవీకే చీఫ్, తమిళనాడు సీఎం విజయ్ తీవ్రంగా ఖండించారు. పోలీసుల తీరును ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా ఆయన అభివర్ణించారు. శాంతియుతంగా ఆందోళన వ్యక్తం చేస్తోన్న రాహుల్ గాంధీ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. తమిళనాడులో విజయ్ తమిళగ వెట్రి కజగం (టీవీకే)తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఆయన ప్రకటనను స్వాగతించింది.
కాంగ్రెస్ మెరుపు ధర్నా:
కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్ మార్చ్ కార్యక్రమంలో నిరసనకారులపై పోలీసుల లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం (జులై 21) ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి యత్నించింది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ ఇంటి దగ్గరలో కాంగ్రెస్ మెరుపు ధర్నాకు దిగింది. రాహుల్ గాంధీ నేతృత్వం వహించిన ఈ ధర్నాలో ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే భాగమై ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చేతులకు తాళ్లు కట్టుకుని ప్రభుత్వ తీరును, పోలీసుల తీరును కాంగ్రెస్ నేతలు ఎండగట్టారు. ప్రధాని మోడీ, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. నిరసనలో భాగమైన కాంగ్రెస్ ప్రముఖ నేతలంతా చేతులకు తాళ్లు కట్టుకుని ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, గొంతెత్తితే బేడీలు వేసి బంధిస్తుందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ సహయ మంత్రి జితేంద్ర సింగ్ ధర్నా విరమించాలని రాహుల్ గాంధీకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
►ALSO READ | మీరే మా దగ్గరకు రండి.. చర్చల ఆహ్వానంపై ప్రభుత్వానికి కాక్రోచ్ పార్టీ కండీషన్..!
కానీ కాంగ్రెస్ వెనక్కి తగ్గలేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నీట్ పేపర్ లీక్పై పార్లమెంట్లో చర్చపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు ధర్నా విరమించేలేదని రాహుల్ గాంధీ భీష్మించుకున్నారు. దీంతో పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీలను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో జరిగిన తోపులాటలో రాహుల్ గాంధీకి స్వల్ప గాయమై.. ఆయన ముక్కు నుంచి రక్తం కారింది.
