మీరే మా దగ్గరకు రండి.. చర్చల ఆహ్వానంపై ప్రభుత్వానికి కాక్రోచ్ పార్టీ కండీషన్..!

మీరే మా దగ్గరకు రండి.. చర్చల ఆహ్వానంపై ప్రభుత్వానికి కాక్రోచ్ పార్టీ కండీషన్..!

నీట్ పేపర్ లీక్‎పై మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా కోరుతూ.. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తున్న ఆందోళనలపై మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దిగివస్తుంది. ఆందోళనలు దేశ వ్యాప్తంగా విస్తరిస్తుండటంతో.. అన్ని వర్గాల నుంచి కాక్రోచ్ పార్టీకి మద్దతు పెరుగుతుండటంతో.. బీజేపీ పెద్దలు చర్చలకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే జేపీ నడ్డా ఆధ్వర్యంలో చర్చలకు రావాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులకు కబురు వెళ్లింది. దీనిపై కాక్రోచ్ పార్టీ స్పందించింది.

నీట్ పేపర్ లీక్‎కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తోన్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి ఒక కండీషన్ పెట్టింది. నీట్ పేపర్ లీక్, కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై చర్చించేందుకు తాము ప్రభుత్వం దగ్గరకు వెళ్లబోమని సీజేపీ తేల్చి చెప్పింది. మాతో మాట్లాడాలనుకుంటే ప్రభుత్వమే మా దగ్గరకు రావాలని షరతు విధించింది.

శాంతియుతంగా నిరసన తెలుపుతోన్న విద్యార్థులపై దమనకాండ కొనసాగించిన ప్రభుత్వ అహంకారం అంతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీజేపీ స్పష్టం చేసింది. బుధవారం (జులై 22) సీజేపీ ప్రతినిధులతో కేంద్రం మరో విడత చర్చలు జరపనుందన్న వార్తల నేపథ్యంలో సీజేపీ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. 

నీట్ 2026 పేపర్ లీక్, విద్యా వ్యవస్థలోని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ జులై 20న పార్లమెంట్ మార్చ్ (చలో సంసద్) చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పార్లమెంట్ మార్చ్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తోన్న ఆందోళనకారులపై పోలీసులు బలప్రయోగం చేశారు. విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. నిరసనకారుల పట్ల పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో నష్ట నివారణ చర్యలకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.

 ఇందులో భాగంగానే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మంగళవారం (జులై 21) సీజేపీ ప్రతినిధులతో భేటీ అయ్యి ముఖాముఖీ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీజేపీ ప్రతినిధులు ప్రభుత్వం ముందు మూడు ప్రధాన డిమాండ్లు పెట్టారు. బుధవారం (జులై 22) సీజేపీ ప్రతినిధులతో కేంద్రం మరో విడత చర్చలు జరపనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చర్చల కోసం ప్రభుత్వం దగ్గరకు తాము వెళ్లబోమని.. ప్రభుత్వమే మా దగ్గరకు రావాలని సీజేపీ డిమాండ్ చేసింది.