మోసపూరిత హామీలతో జనం గోసపడ్తున్నరు: కేటీఆర్

మోసపూరిత హామీలతో జనం గోసపడ్తున్నరు: కేటీఆర్
  • రైతు భరోసా లేదు.. వరికి బోనస్ లేదు.. అంతా బోగస్: కేటీఆర్​
  •     ఆల్మట్టి ఎత్తు పెంపును రేవంత్​రెడ్డి అడ్డుకోవాలి
  •     పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేస్తలే
  •     రోజూ కేసీఆర్​ను తిట్టుడు, మన్నెత్తిపోసుడే కాంగ్రెసోళ్ల పని 
  •     రేవంత్​రెడ్డి వాడే భాషను కేసీఆర్​ ఎప్పుడూ వాడలే 
  •     కాంగ్రెస్​, బీజేపీ ఒక్కటేనని ఆరోపణ
  •     అచ్చంపేట సభలో ప్రసంగం

అచ్చంపేట/ జూబ్లీహిల్స్, వెలుగు:  కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చిందని, వాటితో తెలంగాణ ప్రజలు గోస పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తమ బీఆర్​ఎస్​ పాలనలో నాట్లు వేసే టైంలో రైతుబంధు ఇస్తే కాంగ్రెస్​ హయాంలో ఓట్లు వేసే టైంలో ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఆదివారం అచ్చంపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ జనగర్జన సభలో కేటీఆర్​ మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. ‘‘కర్నాటక ప్రభుత్వం రూ.70వేల కోట్లు ఖర్చు చేసి ఆల్మట్టి డ్యాం ఎత్తును మరో 5  మీటర్లు పెంచుతున్నది. అదే జరిగితే పాలమూరు, నల్గొండ జిల్లాలకు కృష్ణానది ద్వారా చుక్క నీరు రాదు. నల్లమల పులిబిడ్డనని చెప్పుకునే సీఎం రేవంత్​రెడ్డి  రాహుల్​గాంధీ ముందుకు కర్నాటక నేతలను పిలిపించి ఆల్మట్టి ఎత్తును అడ్డుకోవాలి. నల్లమల పులి ఎందుకు గర్జించడం లేదు. 

కాంగ్రెస్​ ప్రభుత్వానికి చేతకాకపోతే బీఆర్​ఎస్​ కార్యకర్తలు అడ్డుకుంటరు” అని ఆయన తెలిపారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే పాలమూరు – -రంగారెడ్డి, కల్వకుర్తి లిఫ్ట్​ స్కీంలకు చుక్క నీరు రాదని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆర్డీఎస్​ రైతాంగానికి అన్యాయం జరిగితే కేసీఆర్​ పాదయాత్ర చేశారని ఆయన తెలిపారు. ‘‘పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్​ను ప్రారంభించిన కేసీఆర్ 90 శాతం పనులు పూర్తి చేస్తే.. రేవంత్​రెడ్డి మిగిలిన పనులు ఎందుకు చేపట్టడం లేదు? ఎన్నికల ముందు ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ ఏమయ్యింది?  కేవలం 25 శాతం మందికి రుణమాఫీ జరిగింది. యూరియా  కోసం లైన్లు కట్టి యుద్ధాలు చేసి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులు దాపురించాయి. రైతుభరోసా లేదు.. వరికి  బోనస్ లేదు.. అంతా బోగస్” అని విమర్శించారు. కాంగ్రెస్​ బకాయిల వివరాలను కార్డు ద్వారా ప్రతి ఇంటికి, గడపకు పంచుతామన్నారు. రూ. 1,350 కోట్లతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మంజూరు చేస్తే ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు.  

రేవంత్​రెడ్డిలాంటి భాషను కేసీఆర్​ వాడలే

‘‘ప్రతిరోజు కేసీఆర్​ను తిట్టుడు, మన్నెత్తిపోసుడు, శాపనార్థాలు పెట్టడమే కాంగ్రెసోళ్ల పని. రేవంత్​రెడ్డికి వచ్చిన తిట్లు ఎవరికి రావు. కండ్లు పీకీ గోటిలాడుతా అంటడు. పేగులు మెడలో వేసుకుంటానని అంటాడు. గతంలో సీఎంలుగా పని చేసిన ఎన్టీఆర్​, చంద్రబాబు, వైఎస్, రోశయ్య, కిరణ్​కుమార్​ రెడ్డి, కేసీఆర్  ఇటువంటి భాష వాడలేదు” అని కేటీఆర్​ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని ఆయన ఆరోపించారు. ‘‘తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్  జాయింట్​ వెంచర్ ప్రభుత్వం నడుస్తున్నది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఇంటిపై ఈడి రెయిడ్​ చేసి ఏడాది దాటినా ఎటువంటి చర్యలు లేవు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక నవోదయ పాఠశాలను కూడా ఇవ్వలేదు. వచ్చే ఎన్నికలలో గెలుస్తమో లేదో, కాంగ్రెస్​ ప్రభుత్వం వస్తుందో రాదో అని మంత్రి జూపల్లి కృష్ణారావు అనడం నిజం కాదా?” అని కేటీఆర్​ వ్యాఖ్యానించారు.  

ఫోర్త్ సిటీ కాదు.. ఉన్న సిటీని పట్టించుకోవాలి

ఫోర్త్ సిటీ కాదు.. ఉన్న సిటీని పట్టించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హితువు పలికారు. రియల్ వ్యాపారం కోసమే ఫోర్త్ సిటీ అంటున్నారని ఆరోపించారు. ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్ పేట్​లో కేటీఆర్ పర్యటించారు. ఇంటింటికి తిరిగి గ కాంగ్రెస్ బకాయి కార్డులు పంపిణీ చేశారు. తర్వాత మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆడబిడ్డలకు నెలకు రూ. 2,500  ఇస్తామన్న హామీ ఎక్కడికి పోయిందన్నారు. కాంగ్రెస్  ప్రభుత్వం  అన్ని వర్గాలకు ద్రోహం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే అవకాశం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రూపంలో వచ్చిందని, మాగంటి సునీత గోపీనాథ్ ను గెలిపించాలని కోరారు. నగరంలోని ప్రజలు వరదలతో సతమతమవుతుంటే ఉన్న సిటీని వదిలేసి ఫోర్త్ సిటీ పేరుతో  ముఖ్యమంత్రి కాలయాపన చేస్తున్నారని  విమర్శించారు.